రాష్ట్రస్థాయి ఖోఖో పోటీ లు షురూ

9 Nov, 2013 00:42 IST|Sakshi

 కీసర, న్యూస్‌లైన్: వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులతో కీసరలో సందడి నెలకొంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక సెరినీటి పాఠశాలలో శుక్రవారం 59వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభమయ్యాయి. వీటిని మేడ్చల్ ఎమ్మెల్యే కేఎల్లార్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. ఇక్కడి పోటీల్లో మంచి ప్రతిభ చూపి జాతీయ, అంతర్జాతీయస్థాయికి చేరుకోవాలన్నారు. ప్రతి క్రీడాకారుడు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రస్థాయి పోటీలు మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
 
 స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఖోఖో పోటీల్లో 23 జిల్లాల నుంచి బాలికలు, బాలుర విభాగంలో ఒక్కో జట్టు చొప్పున పాల్గొంటున్నాయన్నారు. మొత్తం 552 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొంటున్నారని, 130 మంది వ్యాయామఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులకు స్థానికంగా వసతి ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అంతకు ముందు క్రీడాకారులు మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. కార్యక్రమంలో క్రీడా పోటీల రాష్ట్ర అబ్జర్వర్ విజయేందర్, శ్యాంసుందర్, టోర్నమెంట్ ఇన్‌చార్జి రమేష్‌రెడ్డి, తహసీల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎండీఓ నిరంజన్, ఎంఈఓ రాంప్రసాద్, స్థానిక సర్పంచ్ చినింగని గణేష్, ఉపసర్పంచ్ రాయిల శ్రావన్‌కుమార్‌గుప్తా, కీసరగుట్ట దేవస్థానం చైర్మన్ తటాకం నారాయణశర్మ, కాంగ్రెస్ నేతలు తటాకం వెంకటేష్,  పన్నాల బుచ్చిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు జ్యోతి సురేష్, కుర్రి మానస, రాజమణి పాల్గొన్నారు.
 
 మొదటి రోజు విజేతలు
 ఖోఖో పోటీల్లో మొదటిరోజు విజేతలుగా నిలిచిన జట్ల వివరాలను పోటీల ఇన్‌చార్జి రమేష్‌రెడ్డి వెల్లడించారు. బాలికల విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టు మెదక్ జిల్లాపై, నల్గొండ జిల్లా జట్టు ఖమ్మంపై, మెదక్ జట్టు హైదరాబాద్ జిల్లా జట్టుపై, చిత్తూరు జట్టు పశ్చిమగోదావరి జట్టుపై, కరీంగనర్ జట్టు గుంటూరు జిల్లాపై, అనంతపురం జిల్లా జట్టు విజయనగరం జిల్లాపై గెలుపొందాయని వెల్లడించారు. బాలుర విభాగంలో రంగారెడ్డి జట్టు ఖమ్మంపై, మెదక్ జట్టు పశ్చిమ గోదావరిపై, నల్గొండ జట్టు కర్నూలుపై, కడప జట్టు  గుంటూరుపై, ఆదిలాబాద్ టీం నెల్లూరుపై, తూర్పు గోదావరి జట్టు వరంగల్ జిల్లా జట్టుపై విజయం సాధించాయన్నారు.

మరిన్ని వార్తలు