లోకేశ్‌ను ఓడించి తీరుతాం! 

18 Mar, 2019 04:54 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న పద్మశాలీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కెఏఎన్‌ మూర్తి్త

పల్లకీ మోసిన పద్మశాలీలను టీడీపీ మోసం చేసింది

రాష్ట్ర పద్మశాలి సంఘం

సాక్షి, అమరావతి బ్యూరో/ సాక్షి, అమరావతి: పద్మశాలీలకు సంబంధించిన మంగళగిరి అసెంబ్లీ సీటును కబ్జా చేసిన నారా లోకేష్‌ను ఓడించి తీరుతామని రాష్ట్ర పద్మశాలి సంఘం తీర్మానించింది. ఆదివారం విజయవాడలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన రాజకీయ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి 13 జిల్లాల నుంచి పద్మశాలీలు, ముఖ్యనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఎఎన్‌ మూర్తి మాట్లాడుతూ.. పద్మశాలీలకు టికెట్ల కేటాయింపుల్లో అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయన్నారు. ముఖ్యంగా టీడీపీ ఆవిర్భావం నుంచి తమ సామాజిక వర్గం ఆ పార్టీకి పల్లకీ మోసిందని.. అయితే నేడు ఆ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు.

రాష్ట్రంలో పద్మశాలీలు అధికంగా ఉన్న మంగళగిరి సీటును తమకు కేటాయించకుండా సీఎం తన కుమారుడికి కేటాయించి పద్మశాలీల సీటును కబ్జా చేశాడన్నారు. ఇప్పటికే హిందూపురం, చీరాల, ధర్మవరం, వెంకటగిరి స్థానాలను వదులుకున్నామని.. ఇప్పుడు మంగళగిరిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. మంగళగిరిలో తమ సీటును కబ్జా చేసిన సీఎం, లోకేశ్‌కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అక్కడ స్వతంత్య్ర అభ్యర్థిని పోటీలో పెట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

9 శాతం ఉన్న మాకు ఒక్క సీటు ఇవ్వరా..
రాష్ట్ర జనాభాలో దాదాపు 9 శాతం ఉన్న పద్మశాలీలకు టీడీపీ ఒక్క సీటు కూడా కేటాయించకపోవటం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టడమేనని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని సమావేశంలో పద్మశాలి నాయకులు స్పష్టం చేశారు. మంగళగిరి ప్రాంతంలో కొన్న భూములను కాపాడుకోవటానికే లోకేశ్‌ను అక్కడ పోటీలో దించి తమ కడుపు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మశాలీలకు టికెట్‌ ఇచ్చిన పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి నేతలు చినబాబు, రాధాకృష్ణ, ఘంటశాల జగదీశ్, డాక్టర్‌ శారద, వి నాగరాజు, మురళీకృష్ణ, రంగారావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు