‘ఉపాధి’ వేతనాలు ఆలస్యమైతే.. నష్టపరిహారం బాధ్యత రాష్ట్రాలదే

12 Sep, 2013 03:31 IST|Sakshi

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) కూలీలకు వేతనాల చెల్లింపు ఆలస్యం చేస్తే అందుకు వారికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకనుగుణంగా జాతీయ ఉపాధి హామీ చట్టంలో సవరణ చేసింది. పక్షం రోజులు ఆలస్యమైతే ఆ బకాయిల్లో నాల్గో వంతు, పక్షం రోజులు దాటితే బకాయిల్లో సగం మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాలని పేర్కొంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం నోటిఫికేషన్ జారీ చేశారు.

ఉపాధి హామీ చట్టంలోని సెక్షన్ 22(2)(బి) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మొత్తాన్ని భరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ వేతనాల చెల్లింపులో బ్యాంకులు, పోస్టాఫీసులు, అధికారులు,  క్షేత్రస్థాయి అధికారులు ఎవ్వరు జాప్యం చేసినా ఆ మొతాన్ని వారి నుంచే వసూలు చేసి చెల్లించొచ్చని పేర్కొన్నారు.

ఈ నష్టపరిహారాన్ని కూలీల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయాలని వెల్లడించారు. కూలీల మస్టర్ రోల్ పూర్తిచేసిన పక్షం రోజుల్లోగా వారికి చట్ట ప్రకారం వేతనాలు చెల్లించాలని, లేకుంటే ఆయా కూలీలు నష్టపరిహారం పొందడానికి అర్హులని పేర్కొన్నారు. వారికి ఆ మొత్తం అందేలా పథకం అమలు జిల్లా సమన్వయ అధికారి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మరిన్ని వార్తలు