మరో జన్మ ఉంటే గిరిజనుడిగా పుడతా : మంత్రి

14 Jul, 2019 08:34 IST|Sakshi
డ్వాక్రా మహిళలకు చెక్కు అందజేస్తున్న మంత్రి శ్రీనివాస్‌ 

కల్మషం లేని మనసు వారిది

అవినీతి రహిత పాలనే ప్రభుత్వ ధ్యేయం

అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే మా దృష్టికి తెండి

పాడేరు బహిరంగ సభలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌

డ్వాక్రా మహిళలకు బ్యాంకు లింకేజీ చెక్కుల పంపిణీ

సాక్షి, పాడేరు రూరల్‌ : గిరిజనుల్లో ఎటువంటి కల్మషం ఉండదని, ఎప్పుడూ నిండు మనసుతో ప్రేమను పంచుతారని, వచ్చే జన్మంటూ ఉంటే తాను గిరిజనుడిగానే పుడతానని రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక, యువజన వ్యవహారాల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. శనివారం ఆయన ఏజెన్సీ పర్యటనకు వచ్చిన సందర్భంగా పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయం ఓపెన్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా పార్టీలకతీతంగా అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తుందన్నారు.

గిరిజన ప్రాంతంలో అక్షరాస్యత శాతం పెరగాలన్నారు. సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం సద్వినియోగం చేసుకొని తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. తమది పేదల, ప్రజా ప్రభుత్వమని, సీఎం వై.ఎస్‌ జగన్‌ పాలనలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావులేదన్నారు. పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే తమ దృష్టికి తేవాలన్నారు. పాడేరు, అరకు ప్రాంతంలో తమ ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.  

పార్లమెంటులో  ప్రస్తావించా
అరకు ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ పార్లమెంట్‌లో గిరిజన ప్రాంత సమస్యలను ప్రస్తావిస్తున్నానని, అన్ని గిరిజన గ్రామాల్లో శుద్ధి చేసిన రక్షిత తాగునీరు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరానన్నారు. ఏపీకి కచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకువస్తామన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తానన్నారు. పాడేరులో తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తానని, గిరిజనులు తమ సమస్యలను ఇక్కడికి వచ్చి విన్నవించుకోవచ్చన్నారు.

సబ్‌ప్లాన్‌ కింద భారీ కేటాయింపులు
పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో గిరిజనులు అన్ని రకాలుగా దగా పడ్డారన్నారు. గిరిజనుల పట్ల జగనన్నకు ఉన్న ప్రేమాభిమానాలకు బడ్జెట్‌లో ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద రూ.4,988 కోట్ల కేటాయింపులు, గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే నిదర్శనమన్నారు. గిరిజన మనోభావాలను గుర్తించి 1/70 చట్టాన్ని గౌరవించి బాక్సైట్‌ తవ్వకాలని రద్దు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ది అన్నారు.

మౌలిక వసతులపై దృష్టి
అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు, తాగునీరు, విద్య, వైద్య, రోడ్డు, రవాణ సదుపాయాలు కల్పించేందుకు పెద్దపీట వేస్తుందన్నారు. ఏజెన్సీలో వైఎస్సార్‌ ట్రైబల్‌ మెడికల్‌ కళాశాల, ట్రైబల్‌ యూనివర్సిటీ నెలకోల్పేందుకు తొలి బడ్జెట్‌లోనే తమ ప్రభుత్వం నిధులను కేటాయించి గిరిజనుల పట్ల చిత్తశుద్ధి చాటుకుందన్నారు. అనంతరం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గిరిజన సంప్రదాయ అడ్డాకుల గిడుగు, విల్లుంబులను బహుకరించి దుశ్శాలువ కప్పి భారీ గజమాలతో సన్మానించారు. మంత్రి శ్రీనివాసరావు గిరిజనుల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. 188 గ్రామైక్య సంఘాలకు రూ.3.94 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ లోతేటి శివశంకర్, ఐటీడీఏ పీవో డీకే బాలాజీ, సబ్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్,  డాక్టర్‌ నర్శింగరావు,  అరకు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శులు సతక బుల్లిబాబు, జల్లి సుధాకర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు