సీఎం రమేష్‌ ఈ నాలుగేళ్లు ఎక్కడికెళ్లావ్‌

17 Jun, 2018 10:51 IST|Sakshi
మాట్లాడుతున్న విష్ణువర్ధనరెడ్డి 

నాలుగేళ్లుగా ఉక్కుఫ్యాక్టరీని వ్యతిరేకించి ఇప్పుడు నిరాహార దీక్షలా : ఎస్‌ విష్ణువర్ధనరెడ్డి 

సాక్షి, కడప కోటిరెడ్డి సర్కిల్‌ : స్వార్థ రాజకీయాల పేరుతో దొంగ దీక్షలు చేపట్టి రాయలసీమ ప్రజలను మోసగించొద్దు. ఈ నాలుగేళ్లలో మీ పుణ్యమా? అని రాయలసీమ నాశనం అయిందని, ఈ ప్రాంత అభివృద్ధి అంశాలపై ఏ చర్చకైనా సిద్ధమా? అని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ విష్ణువర్ధన్‌రెడ్డి టీడీపీ నేతలకు సవాల్‌ విసిరారు. శనివారం కడపలోని వైఎస్సార్‌ మొమోరియల్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీడీపీ తీరుపై నిప్పులు చెరిగారు.

రాయలసీమ ప్రాంతాన్ని నాశనం చేయడానికి కడపను వేదికగా చేసుకుని రాజకీయాలు చేయడానికి  కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.దీనిని తిప్పి కొట్టడానికి రెండు కోట్ల జనాభా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. నాలుగేళ్లుగా సీఎం మొదలుకుని టీడీపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కడపలో ఉక్కుఫ్యాక్టరీ సాధ్యం కాదని పలు వేదికలపై చెప్పి ఇప్పుడు ఏర్పాటుకు కేంద్రం వ్యతిరేకిస్తోందని నెపం వేస్తే సహించేది లేదన్నారు.  కడప ఉక్కు పరిశ్రమను మేం బాధ్యతగా తీసుకుంటాం.

వైఎస్సార్‌ జిల్లాలో ఎన్నో పెండింగ్‌ ప్రాజెక్టులు ఉన్నాయి, ఉదాహరణకు దాదాపు రూ.250 కోట్లు ఖర్చు చేసిన ఏపీ కార్ల్, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరు, మైదుకూరుల్లోని పాలకర్మాగారాలు, దాణా ఫ్యాక్టరీ, తెలుగు గంగ, హాంద్రీ నీవా ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమ అభివృధ్ధిపై చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి బయటకు రావాలని సీఎం రమేష్‌కు విష్ణువర్ధన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. నాలుగేళ్లుగా ఉక్కుఫ్యాక్టరీ గురించి ఏ మాత్రం పట్టించుకోని మీరు ఇప్పుడు తగుదునమ్మా అంటూ దీక్షలు చేస్తామనడం సిగ్గు అనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నామన్నారు.  


రాయలసీమను రెండో రాజధానిగా ప్రకటించే ధైర్యం టీడీపీకి ఉందా?
పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, జమ్ముకాశ్మీర్‌లు రెండో రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని, అదే తరహాలో రాయలసీమలో రెండో రాజధానిని 30 రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పించి ఏర్పాటు చేయించగలరా? అని సవాల్‌ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి, సింగారెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారధి,గోసుల శ్రీనివాసరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాధర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు పుప్పాల శ్రీనాధరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు భవానీరెడ్డి, తదితరులు పాల్గొని మాట్లాడారు.

మరిన్ని వార్తలు