స్టీల్‌ప్లాంట్‌ జేటీ పరీక్ష పేపర్‌ లీక్‌..!

11 Sep, 2019 12:11 IST|Sakshi
వాట్సాప్‌లో హల్‌చల్‌ చేస్తున్న ప్రశ్నలకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌

వాట్సాప్‌లలో ప్రశ్నల స్క్రీన్‌షాట్లు హల్‌చల్‌

సర్వత్రా వ్యక్తమవుతున్న సందేహాలు

సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌ జూనియర్‌ ట్రైనీ పరీక్ష పత్రం లీకేజీపై వదంతులు చెలరేగాయి. మంగళవారం రాత్రి మెకానికల్‌ పేపర్‌కు సంబంధించిన ప్రశ్నలు స్క్రీన్‌ షాట్లు రూపంలో వాట్సప్‌లలో హల్‌చల్‌ చేశాయి. స్టీల్‌ప్లాంట్‌ జూనియర్‌ ట్రైనీ, ఓసీఎం పరీక్షకు ఈ నెల 7, 8వ తేదీల్లో దేశంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సుమారు 68 వేల మంది దరఖాస్తు చేశారు. అయితే పరీక్షలు ముగిసిన వెంటనే కాకుండా రెండు రోజుల తర్వాత వాట్సాప్‌లలో ప్రశ్నలు రావడంపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

వచ్చిన ప్రశ్నలు ఈసారి జరిగిన పరీక్షలవా..? లేక గతంలో జరిగిన పరీక్షలకు సంబంధించినవా..? లేదా మార్ఫింగ్‌ చేశారా..? అన్నది తెలియాల్సి ఉంది. వచ్చిన ప్రశ్నలు ఈ నెల 8న పరీక్ష జరిగిన ఒక కేంద్రం నుంచి ఒకే సిస్టం నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే పరీక్ష కేంద్రంలోకి మొబైల్‌లను అనుమతించనప్పటికీ ప్రశ్నలు ఎలా వచ్చాయన్నది సందేహాస్పదంగా ఉంది. ఈ అంశంపై యాజమాన్యం స్పందిస్తేనే వాస్తవాలు తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు