నేడు ఉక్కులో ఎన్నికల సమరం

14 Feb, 2015 00:17 IST|Sakshi
నేడు ఉక్కులో ఎన్నికల సమరం

స్టీల్‌ప్లాంట్ గుర్తింపు యూనియన్ ఎన్నిక
11,880 కార్మికులకు ఓటుహక్కు
రెండు ఫ్రంట్ల మధ్య పోటీ రాత్రికి ఫలితాలు వెల్లడి

 
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ గుర్తింపు ఎన్నికలు శనివారం జరగనున్నాయి. ఐదేళ్ళ తరువాత ఎన్నికలు జరుగుతుండటంతో కార్మిక సంఘాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇప్పటి వరకు స్టీల్‌ప్లాంట్‌లో 11 సార్లు గుర్తింపు ఎన్నికలు జరగగా  నాలుగు సార్లు ఇంటక్ ప్యానల్, నాలుగు సార్లు ఏఐటీయుసీ ప్యా నల్, మూడు సార్లు సీఐటీయు ప్యానల్‌లు విజయం సాధించాయి. 2010లో జరిగిన ఎన్నికల్లో కొన్ని సాంకేతిక కారణాలు చోటు చేసుకోవటంతో ఓ యూనియన్ కోర్టుకు   వెళ్ళింది, దీంతో ఆ ఎన్నిక ఫలితాలు విడుదల చేయలేదు. అప్పటి వరకు గుర్తింపులో వున్న ప్రోగ్రెసివ్ ఫ్రంట్ యూనియన్ గుర్తింపు సంఘంగా కొనసాగింది. 2012లో కోర్డు తీర్పు వెలువడటంతో నేటి వరకు కూడా ప్రొగ్రెసీవ్ ఫ్రంట్ గుర్తింపు సంఘంగా కొనసాగింది.
 
ఉక్కు ఎన్నికల్లో రాజకీయ రంగు..

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పాగా వేసేందుకు రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఆయా రాజకీయ పార్టీల అనుభంగా కార్మిక సంఘాల తరుపున నాయకులు ఇప్పటికే ప్రచారాలు చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలిచి తమ సత్తా చాటుకోవాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఉక్కు గుర్తింపు ఎన్నికల్లో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవటంతో ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు జరగనున్న 17 పోలింగ్ కేంద్రాల వద్ద సౌత్ ఎసిపి మధుసూదన్ నేతృత్వంలో భారీగా బందోబస్తుగా ఏర్పాటుచేశారు. ఎన్నికల్లో 11880 మంది ఉక్కు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇందులో 157 పోస్టల్ బ్యాలెట్లు కాగా మిగిలిన 18643 ఓట్లు మాధారం, జగ్గయ్యపేటతో పాటు ప్లాంట్‌కు చెందిన కార్మికులవి.  స్టీల్‌ప్లాంట్‌లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యల్పంగా 86 శాతం, అత్యధికంగా 98 శాతం పోలింగ్ నమోదయింది.
 
19 పోలింగ్ కేంద్రాలు..


ఉక్కు గుర్తింపు ఎన్నికలకు సంబంధించి 19 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో వివిధ విభాగాల్లో 15 పోలింగ్ కేంద్రాలు, ఉక్కు ట్రైనింగ్ సెంటర్ వద్ద ఒకటి, ఉక్కు ఆస్పత్రి వద్ద మరొకటి,  గనుల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల కోసం మాదారం, జగ్గయ్యపేటలో కూడా ఒకోక్క పోలీంగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్టీల్‌ప్లాంట్‌లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుంది. రాత్రి 9 గంటల తరువాత ఫలితాలు విడుదల చేసే అవకాశం వుంది.
 

మరిన్ని వార్తలు