సీ విజిల్‌ మోగించండి

12 Mar, 2019 15:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: సీ విజిల్‌ యాప్‌.. ఎన్నికలను సక్రమంగా, సజావుగా నిర్వహించే దిశగా ఎన్నికల సంఘం తీసుకున్న మరో వినూత్న విధానం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, ఇతర ఎన్నికల అక్రమాలను వెంటనే అరికట్టేందుకు ఈ యాప్‌ను రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. సాధారణంగా అధికార పార్టీలు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తుంటాయి. దీన్ని అరికట్టడానికి ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేస్తాయి. కానీ ఎక్కడ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారో, అక్రమాలకు పాల్పడుతున్నారో అధికారులకు సమాచారం అంది ఆ సంఘటన స్థలానికి చేరుకునేసరికి ఆలస్యమవుతూ ఉంటుంది. ఇంతలో రాజకీయ పార్టీలు ఎంచక్కా తమ పనికానిచ్చేస్తున్నాయి. ఈ లోపాన్ని అధిగమించేందుకు ఎన్నికలసంఘం ఆధునిక సమాచార పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ ‘సీ విజిల్‌’ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్న అంశం ప్రజల దృష్టికి వస్తే ఈ ‘సీ విజిల్‌’ యాప్‌ ద్వారా జిల్లాలోని ఎన్నికల కంట్రోల్‌ రూముకు ఫిర్యాదు చేయొచ్చు. ఆ ఫిర్యాదు క్షణాల్లోనే అధికారులకు చేరి ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు సంఘటన స్థలానికి చేరుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మొదటగా ప్రజలు తమ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో సీ విజిల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఎన్నికల సందర్భంగా ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన, ఇతర ఎన్నికల అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలి.  
 
ఎలా ఉపయోగించాలి అంటే.. 
స్టెప్‌–1 :
పౌరులు ఎవరైనా ఎక్కడైనా ఎన్నికల అక్రమం జరుగుతోందని గుర్తిస్తే ఆ దృశ్యాన్ని వెంటనే ఫొటో లేదా 2 నిముషాల నిడివి ఉండే వీడియో గానీ తీయాలి. అనంతరం తమ ఫోన్‌లోని యాప్‌ ద్వారా ఆ ఫొటో/వీడియోను అప్‌లోడ్‌ చేసి జరుగుతున్న అక్రమం గురించి రెండు వాక్యాలు రాయొచ్చు. అలా చేస్తే ఫోన్‌లో ఉన్న జీపీఎస్‌ టెక్నాలజీ ద్వారా ఎన్నికల ఉల్లంఘన ఎక్కడ జరుగుతోందన్నది వెంటనే జిల్లా కేంద్రంలోని ఎన్నికల కంట్రోల్‌ రూముకు చేరుతుంది. కానీ ఎవరు ఫిర్యాదు చేశారన్న వివరాలు ఎవరికీ తెలియవు. ఆ యాప్‌ పౌరుల వివరాలను అధికారులకు, ఇతరులకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతుంది.  

స్టెప్‌ 2 : జిల్లా కేంద్రంలోని ఎన్నికల కంట్రోల్‌ రూములోని అధికారుల నుంచి ఆ ఫిర్యాదు వివరాలు వెంటనే ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌కు చేరతాయి. దాంతో వారు కొద్దిసేపట్లోనే సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన మీద కేసు నమోదు చేస్తారు. అక్రమాన్ని అరికడతారు.  

స్టెప్‌ 3: అనంతరం ఎన్నికల అక్రమంపై తీసుకున్న వివరాలను అధికారులు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని నేషనల్‌  గ్రీవెన్స్‌ పోర్టల్‌కు నివేదిస్తారు. ఆ వెంటనే 100 నిముషాల్లోనే తాము తీసుకున్న చర్యలను వివరిస్తూ ఫిర్యాదు చేసిన పౌరుడి ఫోన్‌కు సందేశం వస్తుంది. ఈ ప్రక్రియ అంతా అత్యంత విశ్వసనీయమైనది. కాబట్టి పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికలు సక్రమ నిర్వహణలో భాగస్వాములు కావాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరుతోంది.

మరిన్ని వార్తలు