స్థూల‘గాయం’

10 Apr, 2017 14:41 IST|Sakshi

సాక్షి, కర్నూలు :
 ప్రతి 300 మంది పౌరులకు ఒక పోలీసు కానిస్టేబుల్ ఉండాలి. ప్రతి 25 వేల మంది జనాభాకు ఒక పోలీసు స్టేషన్ ఉండాలి. ఈ లెక్కన 40 లక్షలకు పైచిలుకు జనాభా ఉన్న మన జిల్లాలో 11 వేల మంది పోలీసులు ఉండాలి. కాని ప్రస్తుతం పనిచేస్తున్నది కేవలం 2,600 మంది సివిల్ పోలీసులు. అంటే సగటున జిల్లా జనాభాకు రక్షణ కల్పిస్తున్నది పావలా వంతు పోలీసులే.

దీంతో ఒక్కో పోలీసుపై పనిభారం నానాటికీ రెట్టింపవుతోంది. ఈ పని ఒత్తిడితో పోలీసులు వ్యాయామానికి దూరమవుతున్నారు. వ్యాధులకు దగ్గరవుతున్నారు. పొట్ట పెరిగి స్థూలకాయులుగా మారుతున్నారు. నియామక సమయంలో సన్నగా కనిపించే పోలీసులు విధుల్లో చేరాక వారి శరీర ఆకృతిలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

 సాధారణంగా ప్రతి ఉద్యోగి రోజుకు 8 గంటలు పని చేస్తారు. కానీ పోలీసు ఉద్యోగంలో చేరేటప్పుడే వారికిచ్చే మాన్యువల్‌లో అవసరమైతే 24 గంటలూ పనిచేయడానికి సిద్ధంగా ఉండాలనే నిబంధన ఉంటుంది. అలాంటి పరిస్థితులు అప్పుడప్పుడుంటే ఫర్వాలేదు. నిత్యం అలాగే విధులు నిర్వహించాలంటే కష్టమే. జిల్లాలో పోలీసుల పని గంటలు మిగతా వారితో పోలిస్తే ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం జిల్లా జనాభాలోని ప్రతి 1,538 మందికి ఒక్క పోలీసు చొప్పున పనిచేస్తున్నారు. పనిభారం పెరిగి వ్యాధుల బారిన పడుతున్నామని పోలీసులు వాపోతున్నారు.

 సర్వసాధారణం.. బీపీ.. షుగర్..
 జిల్లాలో మొత్తం 2,600 మంది సివిల్ పోలీసులు పనిచేస్తుండగా.. వారిలో ఎక్కువ మంది రక్తపోటు(బీపీ), మధుమేహం(షుగర్) వ్యాధులతో బాధపడుతున్నారు. సమయానికి భోజనం లేకపోవడం.. నిద్రలేమి.. పని ఒత్తిడి ఉండడంతో అధికశాతం పోలీసులు ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. సెక్యూరిటీ విభాగంలో పనిచేసే మరికొందరు మూత్రపిండాలు, కండరాల వ్యాధులతో బాధపడుతున్నారు. ఆహార పద్ధతులు పాటిస్తూ సరైన వ్యాయామం, క్రమం తప్పకుండా పరేడ్‌లో పాల్గొంటే శారీరక ధారుడ్యం పెరుగుతుంది. వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందవచ్చు.

అయితే పోలీసుశాఖలో పరేడ్‌లు నామ్‌కే వాస్తేగానే మారాయి. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగిలిన రోజుల్లో వారాంతపు సెలవులు పెట్టుకోవచ్చనే నిబంధన ఉన్నా.. అది ఎక్కడా అమలు కావడం లేదు. గతంలో ఈ అంశాన్ని నాటి డీజీపీ ప్రసాదరావు ప్రస్తావించినా ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో వారాంతపు సెలవులు అమల్లోకి తెచ్చింది. మన జిల్లాలో కూడా గతంలో ఎస్పీగా పనిచేసిన రఘురామిరెడ్డి వారాంతపు సెలవుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఎన్ని వినతులు అందజేస్తున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు.
 
 ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం..
 వారాంతపు సెలవుల గురించి గతంలోనే మాజీ డీజీపీ ప్రసాదరావు ప్రకటించారు. రాష్ట్ర విభజనతో అది అమలుకు నోచుకోలేదు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారాంతపు సెలవు కర్నూలు జిల్లాలో ఇచ్చేలా నిర్ణయం జరిగింది. ఆళ్లగడ్డ ఉప ఎన్నికతో కొంత ఆలస్యమైంది. కోడ్ ముగియగానే వారాంతపు సెలవులు అమలవుతాయి.
 - నారాయణ,
 పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు
 
 వారానికోసారి పరేడ్..
 పోలీసు సిబ్బంది శారీరకంగా దృఢంగా ఉండేందుకు వారానికి ఒకసారి పరేడ్ నిర్వహిస్తున్నాం. దీనికి క్రమం తప్పకుండా సిబ్బంది మొత్తం హాజరుకావాల్సిందే. దీంతోపాటు యోగా, క్రీడా పోటీలు నిర్వహించే ఆలోచనలో ఉన్నాం. సిబ్బంది దేహాధారుడ్యంపై దృష్టి సారించి.. వారు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటాం. పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులు ఉన్నాయి. అధికారులకు ఇవ్వమని చెబుతున్నాం. అయితే కొన్ని చోట్ల సిబ్బంది సరిపడకపోవడం.. శాంతిభద్రతల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం వంటి కారణాలతో కొంత మందికి సెలవులు దొరకని పరిస్థితి ఉంటుంది. కర్నూలు నగరంలోనూ షిఫ్ట్ డ్యూటీ అమలవుతోంది. పోలీసు సిబ్బందికి సరిపడా విశ్రాంతి ఇస్తున్నాం.
 - ఆకె రవికృష్ణ, జిల్లా ఎస్పీ

మరిన్ని వార్తలు