రామాయపట్నం పోర్టుకు స్టిక్కర్‌ సినిమా

12 Mar, 2019 11:14 IST|Sakshi
స్టిక్కర్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న చంద్రబాబు (పైల్‌)

సాక్షి, కావలి: ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్లుగానే ఎన్నికల కోసం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు స్టిక్కర్‌ సినిమా చూపించారు. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రూ.25 వేల కోట్లతో భారీ పోర్టు కమ్‌ షిప్‌ యార్డు నిర్మాణానికి కేంద్రం ముందుకు వచ్చింది. అయితే ఈ పోర్టును ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపట్టాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా పోర్టు నిర్మాణానికి ఆమోదం లేఖ ఇవ్వకుండా ముఖం చాటేసింది. ఎన్నికలు సమీపించడంతో పోర్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తడంతో చివరాకరుకు ‘స్టిక్కర్‌ సినిమా’ చూపించారు. రామాయపట్నం సముద్ర తీరం భౌగోళికంగా ప్రకాశం జిల్లాలో ఉన్నా.. మొట్టమొదటగా జిల్లాలోని కావలి, ఉదయగిరి నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో రామాయపట్నం పోర్టు నిర్మాణం ఈ ప్రాంత ప్రజల్లో సెంట్‌మెంట్‌గా మారింది. అయితే ఇంతటి ప్రాధాన్యత కలిగిన పోర్టు విషయంలో స్వలాభం కోసం పాకులాడిన చంద్రబాబు ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్నాక.. కేంద్ర  ప్రభుత్వంపై నెపం నెట్టేస్తూ రామాయపట్నం పోర్ట్‌ నిర్మించడానికి ఇష్టపడటం లేదని చంద్రబాబు విమర్శలు చేస్తూ, గత సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేట్‌ రంగం సహకారంతో పోర్టు నిర్మిస్తుందని ప్రకటించారు. దీంతో బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్ర కావలిలో హంగామా చేశారు. అదే నెల 20వ తేదీ రామయపట్నంలో టీడీపీ నాయకులు కృతజ్ఞతల సభ పెట్టి చంద్రబాబుకు ప్రజలు రుణపడి ఉన్నారంటూ ఉపన్యాసాలిచ్చారు. 

సీన్‌ కట్‌ చేస్తే..
ఈ ఏడాది జనవరి 9వ తేదీ చంద్రబాబు రామాయపట్నంకు హెలికాప్టర్‌లో వచ్చి పోర్టును నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. భారీ హంగామాతో జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు రాయికి అంటించిన స్టిక్కర్‌ శిలాఫలకానికి ముసుగు తొలగించి స్టిక్కర్‌ సినిమా ప్రజలకు చూపించి రామాయపట్నం పోర్ట్‌  నిర్మించేందుకు శంకుస్థాపన చేసినట్లుగా ప్రకటించారు. రూ.4,500 కోట్లతో పోర్టు నిర్మాణం మాత్రం వచ్చే ఏడాది మొదలు పెడుతామని చంద్రబాబు చెప్పారు. అసలు ఏడాది తర్వాత నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి ఇప్పుడు శంకుస్థాపన ఏమిటని అప్పడే కార్యక్రమంలో పాల్గొన టీడీపీ నాయకులే పెదవి విరిచారు. చంద్రబాబు ప్రజలకు చూపించిన స్టికర్‌ను ఎన్నికల్లో ప్రజలకు చూపించి మభ్యపెట్టాలని టీడీపీ నాయకులు పెద్ద స్కెచ్‌లే వేశారు. అయితే చంద్రబాబు స్టికర్‌ చినిగిపోయి, గాలికి ఎగిరి పోయింది. అసలు శంకుస్థాపన వివరాలు తెలియజేసే స్టిక్కర్‌ రామయపట్నం వద్ద లేకపోవడంతో టీడీపీ నాయకులు తలలు పట్టుకొంటున్నారు. ఇన్ని వేల కోట్లతో చేపట్టే పోర్టు నిర్మాణానికి కనీసం శాశ్వతంగా ఉండే శిలాఫలకాన్ని కాకుండా చినిగిపోయే స్టిక్కర్‌తో శంకుస్థాపన సినిమా చూపించడం చూస్తే ‘ఇది ఎన్నికల సినిమా’అని అర్థమవుతోంది. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో రామో.. తెలియదు.. శిలాఫలకమైతే శాశ్వతంగా ఉంటుంది. దీన్ని టీడీపీ వైఫల్య ప్రాజెక్ట్‌గా ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయని ముందుస్తు ఆలోచనతో స్టిక్కర్లతో శంకుస్థాపన చేశారని స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 పేపర్‌ మిల్లుకు స్టిక్కర్‌ శిలాఫలకం 
ఇది ఇలా ఉంటే రూ.24,500 కోట్లతో రామాయపట్నంలో పేపర్‌ మిల్లును నిర్మిస్తున్నట్లు, అందులో 18 వేలు మందికి ఉద్యోగాలు ఇస్తారని చంద్రబాబు అదే రోజు శంకుస్థాపన చేశారు. అక్కడ కూడా స్టిక్కర్‌ సినిమానే చూపించారు. ఆ స్టిక్కర్‌ మాత్రం కొంచెం చినిగి ఇంకా గోడకు అంటుకొని ఉంది. ఈ పేపర్‌ మిల్లు నిర్మాణ పనులు కూడా మొదలే కాలేదు.
 కేంద్ర ప్రభుత్వం భారీ ఓడ రేవు, నౌకా నిర్మాణ కేంద్రం నిర్మించడానికి సిద్ధపడితే, దానికి అంగీకరించకుండా బుల్లి పోర్టు నిర్మిస్తామని చంద్రబాబు, మంత్రులు నారాయణ, ద్దా రాఘవరావు, టీడీపీ నేతలు బీద రవిచంద్ర, బీద మస్తాన్‌రావు శంకుస్థాపన కోసం వాడిన స్టిక్కరే లేకపోవడంతో తాము ప్రజలకు ఏ మొహం పెట్టుకొని పోర్టు ప్రస్తావన చెప్పాలని టీడీపీ నాయకులు బిక్కమోహం పెట్టుకొని కర్మరా బాబు అంటూ నిట్టూర్చుతున్నారు. రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేశారు. అభివృద్ధి పనులు మాత్రం బాహుబలి సినిమా సెట్టింగ్‌లను మించి గ్రాఫిక్‌ చిత్రాల్లో కనిపిస్తున్నాయి. ఎన్నికల కోసం చంద్రబాబు శాశ్వత శిలాఫలకాలకు బదులు.. స్టిక్కర్లతో జనానికి సినిమా చూపిస్తున్నారు.
– నరేంద్ర మోదీ, భారత ప్రధాని గుంటూరు బహిరంగ సభలో వ్యాఖ్యలు  

నిన్ను నమ్మలేము బాబు
ఏడేళ్లుగా రామాయపట్నంలో భారీ పోర్ట్‌ను, ఓడలు తయారు చేసే కర్మాగారాన్ని, మరమ్మతులు చేసే పరిశ్రమ స్థాపిస్తారని చెబుతుంటే వింటూనే ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నిర్మించడానికి రెడీగా ఉన్నా,  చంద్రబాబు ఎందుకు సరే అనలేదో ఇప్పటికీ అర్థం కావడం లేదు. పోనీ చంద్రబాబు కట్టేదా అంటే.. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటారు. ఇప్పడేమో శంకుస్థాపన చేసి, సంవత్సరం తర్వాత నిర్మాణ మొదలు పెడతామన్నారు. ఇవన్నీ ఎలా నమ్మాలి. ఈ పోర్టు నిర్మించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. శాశ్వత శిలాఫలకం బదులు స్టిక్కర్‌ శిలాఫలకం వేయడంలో చంద్రబాబు చిత్తశుద్ధి తేటతెల్లమవుతోంది. అందుకే నిన్ను నమ్మలేము బాబు.
 – బొగ్గవరపు వెంకటేశ్వర్లు, కావలి 

చంద్రబాబు అన్యాయం చేశారు
రామాయపట్నం పోర్టు విసయంలో మొదటి నుంచి కూడా చంద్రబాబు ది మోసపూరితమైన వైఖరినే అవలంబిస్తున్నారు. అందుకే ఎన్నికలు దగ్గరుకు వచ్చేనప్పుడు శంకుస్థాపన అంటూ హడావుడి చేశారు. టీడీపీ నాయకులు అయితే పోర్టు కట్టేసి ఓడలు కూడా వచ్చేనట్లుగా గ్రాఫిక్స్‌ సినిమా చూపించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మించే ఓడరేవులకే వాణిజ్య పరంగా అంతర్జాయ మార్కెట్‌లో ప్రాధాన్యత ఉంటుంది. యువకులకు ఉద్యోగాలు వస్తాయి. కానీ చంద్రబాబు పోర్టు విషయంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాకు ప్రజలకు అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం పోర్టు నిర్మిస్తానంటే పట్టించుకోని చంద్రబాబు ఎన్నికల సమయంలో స్టిక్కర్లతో జనాన్ని మోసం చేశాడు.
– షేక్‌ నాయబ్‌ రసూల్, కావలి
 

మరిన్ని వార్తలు