రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు

23 Aug, 2014 01:57 IST|Sakshi
రెచ్చిపోయిన టీడీపీ వర్గీయులు

వైఎస్సార్ సీపీ నాయకులపై కర్రలు, రాళ్లతో దాడి
కౌన్సిలర్ భర్తతోపాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలు
బాధితులను పరామర్శించిన జంగా కృష్ణమూర్తి
పిడుగురాళ్ల: పట్టణంలోని 4వ వార్డు పరిధిలోని ప్రజాశక్తి నగర్‌లో గురువారం అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆ వార్డుకు చెందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పోలు లక్ష్మీనారాయణమ్మ భర్త శ్రీనివాసరెడ్డి, పోలు అంకిరెడ్డి, బారెడ్డి మల్లారెడ్డిపై కర్రలు, రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడిచేసి కొట్టడంతో ముగ్గురు వైఎస్సార్ సీపీ నాయకుల తలలు పగిలి తీవ్రరక్తస్రావమైంది.
 
పక్కా ప్రణాళికతో దాడి..
టీడీపీ నాయకులు పక్కా ప్రణాళికతోనే దాడికి పాల్పడ్డారని క్షతగాత్రులు ఆరోపించారు.  వార్డులో ఇటీవల వాటర్ ట్యాపు ఏర్పాటుకు మున్సిపల్ అధికారులు తవ్వించిన బోరును వారి ఆదేశంతో సిబ్బంది బుధవారం సాయంత్రం పూడ్చివేయించారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లిన కౌన్సిలర్ భర్త శ్రీనివాసరెడ్డి గుంతను ఎందుకు పూడ్చుతున్నారంటూ సిబ్బందిని ప్రశ్నించగా.. ప్రస్తుతం ట్యాపు ఏర్పాటు కుదరదని, అందుకే మున్సిపల్ అధికారుల ఆదేశాలమేరకు పూడ్చుతున్నామని సమాధానమిచ్చారు. అదేవార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వాయిరి వెంకట్రావు, ఇతర పార్టీ నాయకులు తాము ట్యాపు వేయించేందుకు తీయించిన గుంతను కౌన్సిలర్ భర్త పూడ్చివేయించాడని ఆరోపిస్తూ బుధవారం అర్ధరాత్రి శ్రీనివాసరెడ్డి బాబాయి పోలు తిమ్మారెడ్డి ఇంటిపైకి వెళ్లి దుర్భాషలాడి దాడి చేయగా స్వల్పంగా గాయపడ్డాడు.

బాధితుడు తిమ్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పోలీసులకు ఫిర్యాదుచేయగా.. గురువారం ఉదయం పోలీసులు.. వెంకట్రావు తదితరులను స్టేషన్‌కు పిలిపించారు. కేసు నమోదు చేయకుండా మళ్లీ సాయంత్రం రావాలని, సాయంత్రం వెళ్తే శుక్రవారం ఉదయం రావాలని పోలీసులు చెప్పినట్లు శ్రీనివాసరెడ్డి తదితరులు తెలిపారు. పోలీసు కేసు పెట్టారన్న కక్షతో టీడీపీ నాయకులు పథకం ప్రకారం గురువారం అర్ధరాత్రి తమపై  దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.

తన ఇంటి వద్ద బైకుపై ఇద్దరు వ్యక్తులు అటూ ఇటూ తిరుగుతుండడంతో అంకిరెడ్డి, మల్లారెడ్డిలతో కలసి వారిని ద్విచక్ర వాహనంపై వెంబడించగా.. కొంతదూరం వెళ్లిన అనంతరం మలుపు వద్ద అప్పటికే కాపుకాసిన వెంకట్రావు, సుబ్బారావు, శివయ్యలతోపాటు సుమారు 20 మంది తమ కళ్లలో కారం చల్లి కర్రలు, రాడ్లతో దాడిచేశారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమకు తలలు పగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేయగా, నిందితులను పట్టుకొచ్చిన పోలీసులు తమను కూడా కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
క్షతగాత్రులకు జంగా పరామర్శ
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో గాయపడిన ముగ్గురు వైఎస్సార్ సీపీ నాయకులను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో  ఆ పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి శుక్రవారం ఉదయం పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ పట్టణ అధ్యక్షుడు చింతా వెంకటరామారావు, మండల అధ్యక్షుడు చల్లా పిచ్చిరెడ్డి, రేపాల శ్రీనివాసరావు, కట్టా వెంకటేశ్వరరెడ్డి, అల్లు పిచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు