కొనసాగుతున్న వరదలు..

6 Aug, 2019 10:57 IST|Sakshi
విజ్జేశ్వరం కాటన్‌ బ్యారేజీల నుండి సముద్రంలోకి విడుదల చేస్తున్న వరద నీరు

సాక్షి, పశ్చిమగోదావరి(ఏలూరు) : పోలవరం ముంపు గ్రామాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. వారికి ఇంకా బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేవు. వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో వారు కొండగుట్టలపై తాత్కాలికంగా టెంట్లు వేసుకుని ఉంటున్నారు. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద నీరు భారీగా వస్తోంది. మంగళవారం కూడా వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి 12.5 అడుగుల నీటిమట్టం కొనసాగుతుండగా, 10.92 లక్షల క్యూసెక్కుల వరదనీరు సముద్రంలోకి వెళ్తోంది. ఈసీజన్‌లో ఇప్పటివరకు సుమారు 635 టీఎంసీల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశామని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. బాధితులను ఆదుకోవడానికి అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు వరదలకు జిల్లా వ్యాప్తంగా 5300 కుటుంబాలు ప్రభావితమయ్యారని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ప్రకటించారు. జిల్లాలో రెండు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొరుటూరు గ్రామ ప్రజలకు పోలవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో,  రేపాకగొమ్ము గ్రామస్తులకు వేలేరుపాడులోని సోషల్‌ వెల్ఫేర్‌ బాలుర వసతి గృహంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.  ఆయా పునరావాస కేంద్రాలకు 51 కుటుంబాలకు చెందిన 133 మందిని తరలించారు.  పోలవరంలో 31 మందితో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం,  వేలేరుపాడులో 28 మందితో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం, ఆచంటలో 38 మందితో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం వరద సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి.

పంటలకు తీవ్ర నష్టం
వరదలకు 18 మండలాలలో 412 హెక్టార్లలో ఆకుమడి, 1026 హెక్టార్లలో వరి నాట్లు నష్టం వాటిల్లిందని అంచనా. పెరవలి మండలంలో కానూరు, కానూరుఅగ్రహారం, ఉసులుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఉమ్మిడివారిపాలెం, ఓదూరివారిపాలెం, ముత్యాలవారిపాలెం, లంకమాలపల్లి, ఖండవల్లి, మల్లేశ్వరం గ్రామాలలో 3వేల ఎకరాలు పూర్తిగా నీట మునిగాయి.  ఇందులో కోకో, అరటి, కంద, పసుపు, ఆయిల్‌పామ్, చెరకు తోటలతో పాటు జామ, బొప్పాయి, కొబ్బరి, తమలపాకు తోటలు, కూరగాయల పంటలు, పూలతోటలు, మొక్కజొన్న తోటలు నిలువునా మునిగిపోయాయి. వాణిజ్య పంటలైన కంద, పసుపు, చెరకు, అరటి పంటలకు ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టగా అదంతా గంగలో పోసినట్లు అయ్యిందని వాపోతున్నారు. 

అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు
వరద ముంపు ప్రాంతాలలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు విస్త్రతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి  చెరుకువాడ శ్రీరంగనాథరాజు రెండోరోజు కూడా ఆచంట మండలంలోని అనగారలంక, పెదమల్లంలంక, పల్లిపాలెం, అయోధ్యలంక, పుచ్చలంక, రాయిలంకల్లో అధికారులతో కలిసి పర్యటించారు.  1684 కుటుంబాల వారికి ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, లీటరు పామాయిల్‌ పంపిణీని ఆయన ప్రారంభించారు. పోలవరం మండలంలోని ముంపు గ్రామాల ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేందుకు వెళుతున్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు టూరిజం బోటుకు తృటిలో ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా పోశమ్మగండి నుంచి అధికారులతో కలిసి సోమవారం ముంపు గ్రామాలను సందర్శించేందుకు వెళుతున్న టూరిజం బోటు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎగువ గ్రామాలకు వెళుతున్న సమయంలో మూలపాడు వద్ద కొండపక్క నుంచి వెళుతుండగా అధిక ప్రవాహంలో ఒక్కసారిగా ఊగిపోతూ నదిలో కిందకు దిగిపోయింది.

దీంతో మరలా బోటు నదిలో మధ్యలో నుంచి మళ్లించి పశ్చిమగోదావరి జిల్లా వైపు తిప్పడంతో బోటులో ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ నుంచి వాడపల్లి వరకు చేరుకున్నారు. పోలవరం గ్రామంలో రెండు ఖాళీ లాంచీలు గోదావరి నదిలో ముంపునకు గురయ్యాయి. పోలవరం గ్రామ శివారులో నది ఒడ్డున రెండు లాంచీలను ఆదివారం రాత్రి నిలిపివేశారు. సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా గాలి రావడం, గోదావరి వరద హోరుతో లంక ఒడ్డులు విరిగి పడి లాంచీలకు కట్టిన తాళ్లు తెగిపోయాయి. దీంతో లాంచీలు మునిగిపోయాయి. ముంపు మండలమైన వేలేరుపాడులో గోదావరి వరదతో నీటి స్థంభాలు మునిగిపోవడంతో నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. మరోవైపు వశిష్టగోదావరి  మరింత  ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తోంది. ఎగువప్రాంతం నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో రోజురోజుకూ నరసాపురంలో నీటిమట్టం పెరుగుతోంది. నర్సాపురం లాకుపేటలోకి కూడా నీరు చేరింది. గోదావరిని ఆనుకుని ఉండటంతో లాకుపేటలో దాదాపు 40 ఇళ్లు నీటమునిగాయి. 

మరిన్ని వార్తలు