అపహరించిన బ్యాలెట్ బాక్సుల గుర్తింపు

2 Aug, 2013 03:26 IST|Sakshi
పంచాయతీ ఎన్నికల్లో పరాజయాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్, టీడీపీ వర్గీయులు కౌంటింగ్ కేంద్రం నుంచి అపహరించిన బాలెట్ బాక్స్‌లను పోలీసులు బావిలో గుర్తించారు. మొత్తం అపహరణకు గురయిన నాలుగు బాక్స్‌ల్లో మరొకటి గుర్తించాల్సి ఉందని తెలిపారు. వివరాలు..  బొల్లాపల్లి మండలంలోని మూగచింతలపాలెం పంచాయతీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చేబ్రోలు చెంచమ్మ బుధవారం విజయం సాధించారు. కౌంటింగ్ ముగిసిన అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫలితం ప్రటించే సమయంలో కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు దాడులకు తెగబడ్డారు. ప్రత్యర్థి విజయం సాధించారనే అక్కసుతో స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలోకి చొచ్చుకొచ్చి విధ్వంసం సృష్టించారు. 
 
 బ్యాలెట్ బాక్స్‌లను అపహరించారు. దీంతో అధికారులు తాత్కాలికంగా ఫలితాన్ని నిలిపివేశారు. గురువారం సంఘటనా ప్రాంతాన్ని తహశీల్దార్ ఎస్.లక్ష్మయ్య, రూరల్ సీఐ చినమల్లయ్య, ఎస్‌ఐ సురేద్రబాబులు సంద ర్శించారు. కౌంటింగ్ కేంద్రం సమీపంలోని మంచి నీళ్ళ బావులను ప్రత్యేక బలగాలతో కలసి గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు బ్యాలెట్ బాక్స్‌లు మాయం కాగా మూడింటిని బావుల నుంచి వెలికితీశారు. మరో ఒకటి లభించాల్సి ఉందని సీఐ తెలిపారు. బాక్స్‌ల్లోని బ్యాలెట్ పత్రాలను చించి బావిలో పడేయడాన్ని అధికారులు గుర్తించారు. జరిగిన సంఘటపై విచారణ చేపట్టామని దాడులకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చె ప్పారు.
 
 రక్షణ కల్పించండి...
 కౌంటింగ్ కేంద్రంలో విధ్వంసం సృష్టించిన ఘటనపై మండలంలోని మూగచింతలపాలెం వాసులు గురువారం బొల్లాపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త నన్నపనేని సుధ ఆధ్వర్యంలో వె ళ్లిన ఎస్సీ కాలనీ వాసులు తమకు రక్షణ కల్పించాలంటూ ఎస్‌ఐ సురేంద్రబాబును కోరారు. కన్నీరు మున్నీరవుతున్న విజయం సాధించిన అభ్యర్థి చెంచమ్మను సుధ ఓదార్చి ధైర్యం చెప్పారు. దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కులం పేరుతో దూషించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని,
 
 ఏజెంట్లపై దాడి చేసిన వారికి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా వైఎస్సార్ సీసీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించిన గ్రామాల్లో ప్రత్యర్థులు దాడులకు దిగే అవకాశం ఉందని మండల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుమ్మనంపాడు గ్రామంలో టీడీపీ వర్గీయులు అలజడి సృష్టిస్తున్న వైనంపై ఎంపీడీవో అశోక్‌బాబుకు గురువారం గ్రామస్తులతో కలసి ఫిర్యాదు చేసినట్లు వజ్రాల వెంకటరెడ్డి తెలిపారు. కనుమలచెర్వు గ్రామంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఇళ్ళపై బుధవారం రాత్రి రాళ్లు రువ్విన ఘటనపై కూడా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
>
మరిన్ని వార్తలు