రాయగడ పోలీస్‌స్టేషన్‌పై రాళ్ల దాడి

14 Jul, 2019 07:11 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి

సాక్షి, రాయగడ(శ్రీకాకుళం) : పట్టణంలోని సహిద్‌ లక్ష్మణ్‌నాయక్‌ విగ్రహం వద్ద హరిజనులు, గిరిజనులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఇదే విషయంపై ఆయా వర్గాలు ఒకరిపై మరొకరు రాయగడ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసుకున్నాయి. ఇదే విషయంపై స్పందించిన ఎస్‌పీ శరవన్‌ వివేక్‌ ఇరువర్గాలను విచారించి, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే ఆ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా శనివారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ నేత అప్పలస్వామి కడ్రక, తన మద్దతుదారులతో కలిసి, పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఇదే సమయంలో మోటారు సైకిళ్లతో స్టేషన్‌కు వచ్చిన హరిజన యువకులు, మహిళలు పోలీస్‌స్టేషన్‌పై రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఇదిలా ఉండగా ఎస్‌పీ కారు అద్దాలు ధ్వంసం కాగా, పోలీస్‌స్టేషన్‌ కాస్త మరమ్మతులకు గురైంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఆ పరిస్థితులను నిలువరించేందుకు ఆందోళనకారులపై లాఠీచార్జికి దిగి నిలువరించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ఆందోళనకారులు మాట్లాడుతూ ఉమేషహీయల్‌ అనే యువకుడిపై అప్పలస్వామి కడ్రక మద్దతుదారులు దాడి చేశారని, తీవ్రగాయాలతో వచ్చి, ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు చేపట్టలేదని వాపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అప్పలస్వామి కడ్రకకు గిరిజనులు, కాంగ్రెస్‌ రెబల్‌గా బరిలో దిగిన మకరంద ముదిలికి హరిజనులు మద్దతుపలికారు. ఇదే విషయమై ఆ ఇరువర్గాలు ఎన్నికల అనంతరం పలుమార్లు దాడులకు దిగినట్లు స్థానిక సమాచారం.  

మరిన్ని వార్తలు