మన్యంలో మరణాలను అరికట్టండి

6 Aug, 2015 23:50 IST|Sakshi
మన్యంలో మరణాలను అరికట్టండి

{పసవాలపై ప్రత్యేక శ్రద్ధ
ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్

 
పాడేరు: ఏజెన్సీలో వివిధ వ్యాధుల వల్ల చోటుచేసుకుంటున్న మరణాల నియంత్రణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్  వైద్యాధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో గురువారం ఏజెన్సీలోని ఎస్పీహెచ్‌వోలు, వైద్యాధికారులు, ఐసీడీఎస్ అధికార్లతో సమీక్షించారు. పీవో మాట్లాడుతూ ఏజెన్సీలో మలేరియాకు తోడు క్షయ కూడా మరణాలకు కారణమవుతోందన్నారు. క్షయ రోగులను గుర్తించిన వెంటనే వైద్యసిబ్బందిని అప్రమత్తం చేసి చికిత్స అందించే బాధ్యత ఎస్పీహెచ్‌వోలదేఅన్నారు. ఏజెన్సీలో 589 టీబీ కేసులు ఉన్నాయని, వీటిలో 492 మం దికి పౌష్టికాహారం లేక క్షయ సోకినట్లు గుర్తించినట్టు తెలిపారు.గర్భిణులు అధికశాతం మంది రక్తహీనతకు గురవ్వడం,  కాన్పులకు సకాలంలో ఆస్పత్రులకు చేరకపోవడం వల్ల, నెలలు నిండక ముందు ప్రసవం, ఇళ్ల వద్ద ప్రసవాలు వంటి కారణాలతో చోటుచేసుకుంటున్న మరణాలను నియంత్రించాలన్నారు. గిరిజన మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి సంబంధిత పీహెచ్‌సీ పరిధిలోని వైద్యాధికారి, ఏఎన్‌ఎం, ఆశ, అంగన్వాడీ వర్కర్లు నిర్ణీత సమయానికి మందులు, పౌష్టికాహారం అందించి ప్రసవతేదీకి రెండు రోజుల ముందే ఆస్పత్రికి తరలించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మరణాలు నియంత్రించ వచ్చని సూ చించారు. ఐటీడీఏలో ఏర్పాటు చేస్తున్న హెల్త్ కాల్‌సెంటర్ పనితీరును పవర్‌పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. కాల్ సెంటర్ టోల్‌ఫ్రీకి1800 4250 0004 నంబ రును కేటాయించినట్లు తెలిపా రు. గర్భిణులు, పిల్లలకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్లు సకాలంలో అందించడంపై ఎస్పీహెచ్‌వోలు పర్యవేక్షించాలన్నారు. సికిల్‌సెల్ ఎనీమియాపై దృష్టి సారించాలన్నారు. ఆశ్రమాల్లో బాలికలకు హెమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. డీఎంహెచ్‌వో డాక్టర్ సరోజిని మాట్లాడుతూ ఆస్పత్రి కాన్పుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరణాలను నివారించాలన్నారు.

జి.మాడుగుల, దారకొండ, తాజంగి పీహెచ్‌సీల పరిధిలో ఇటీవల సంభవించిన 5 బాలింత మరణాలపై సంబంధిత వైద్యాధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్, జేడీ అరుణ్‌కుమారి మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు సమర్థంగా విధుల నిర్వహణకు ట్యాబ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వాటి వినియోగంపై 8 నుంచి 11వ తేదీ వరకు శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టన్ ఎన్.వసుంధర, డీఎంవో తులసి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి విజయలక్ష్మి, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ దేవి, ఏడీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు