అక్రమ మైనింగ్‌ను ఆపాల్సిందే

10 Sep, 2015 04:24 IST|Sakshi
అక్రమ మైనింగ్‌ను ఆపాల్సిందే

- ఉడమలకుర్తి, చిన్నపల్లి గ్రామస్తుల ధర్నా  
- మద్దతు తెలిపిన ఎమ్మెల్యే చాంద్‌బాషా
కదిరి:
‘‘తలుపుల మండలం గుండ్లకొండలో చేపట్టిన అక్రమ మైనింగ్‌ను ఆపాల్సిందే.. లేదంటే అందరం ఇక్కడే  ఏదైనా తాగి చచ్చిపోతాం..’’ అని ఆ కొండను ఆనుకొని ఉన్న చిన్నపల్లి, ఉడమలకుర్తి వాసులు హెచ్చరించారు. బుధవారం ఆ రెండు గ్రామాల ప్రజలు స్థానిక ఆర్‌డీఓ కార్యాలయం ముందు సుమారు 4 గంటల పాటు ధర్నాకు దిగారు. గ్రామస్తులు మాట్లాడుతూ, గుండ్లకొండలో తమ ఇలవేల్పు దేవుడు గుండ్లకొండరాజు గుడి ఉందని, మైనింగ్ లీజుదారులు ఆ గుడిని కూల్చేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు.

అధికార పార్టీ నాయకుల అండదండలతోనే అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. కొండపై ఉన్న పురాతనమైన గుడి  ఆనవాళ్లు కూడా లేకుండా చేయాలని చూస్తున్నారని, తక్షణం లీజు అనుమతులను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మైనింగ్‌కు అనుమతులు కోరితే 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అనుమతులిచ్చారని  శాపనార్థాలు పెట్టారు. ఆ బ్లాస్టింగులతో తమ ఇంఇ గోడలు నెర్రెలు చీలడంతోపాటు వాటి శబ్దాలకు ఇళ్లలో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని వాపోయారు.
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
అక్రమ మైనింగ్ కారణంగా ఇబ్బంది పడుతున్న చిన్నపల్లి, ఉడమలకుర్తి గ్రామస్తులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా హామీ ఇచ్చారు. ఆయన ఆర్‌డీఓ కార్యాలయం చేరుకొని ఆ గ్రామస్తులతో కలిసి ఆర్‌డీఓతో మాట్లాడారు. తాను కూడా త్వరలోనే అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలిస్తానన్నారు.

>
మరిన్ని వార్తలు