రోగాలు నిల్వ

10 Dec, 2013 02:01 IST|Sakshi

ఈ దుస్థితి మారేనా...
 =ఉసురు తీస్తున్న ఆహారపుటలవాట్లు
 =నిల్వ ఆహారంతో రోగాలు కొనితెచ్చుకుంటున్న మన్యజనం

 
హుకుంపేట, న్యూస్‌లై న్ :  తిండి కలిగితె కండ కలదోయ్...కండ కలవాడేను మనిషోయ్..అన్నాడో మహాకవి. అయితే కొందరు ప్రజలు తిండి అలవాట్లతోనే రోగాల బారిన పడుతున్నారు...మృత్యువాత పడుతున్నారు. సంప్రదాయక ఆహారపదార్ధాలు, వంటకాలతో పాటు వారు తీసుకునే కల్లు వంటివి కూడా విషపూరితం కావడం వారికి శాపంగా పరిణమిస్తోంది.

అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లలో మార్పు తీసుకురావడంలో ఇటు ప్రభుత్వం కాని, అటు స్వచ్ఛంద సంస్థలు కానీ చర్యలు చేపట్టడం లేదు. ముఖ్యంగా నిల్వ ఉన్న మాంసం, విషపూరితమైన పుట్టుగొడుగులు, ఆరోగ్యానికి మేలు చేసేవైనా మితిమీరి తీసుకోవడం, కొన్నిరకాల కొండఆకు కూరలు, దుంపలు నిల్వ చేయడంలో సరైన పద్ధతులు పాటించకపోవడం, కల్లు తయారీలో విషపూరితమైన వేర్లు వినియోగించడం వంటి కారణాలతో ఇక్కడి గిరిజనులు అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు.

అనారోగ్యానికి ‘గొడుగు’:  మన్యంలో గిరిజనులు అధికంగా పుట్టుగొడుగులు, వెడురుగొడుగులు, మామిడి గొడుగులు, జిల్లేడు గొడుగులు, పేడగొడుగులు, గడ్డిగొడుగులు వంటకాలుగా అధికంగా వినియోగిస్తూ ఇబ్బం దులు పడుతున్నారు. వీటి వల్ల మృతి చెందిన వారు మండలంలో అనేక మంది ఉన్నారు. తీవ్ర అనారోగ్యం బారిన పడి కోలుకోలేని వారు ఉన్నారు. అడ్డుమండ, మఠం, దిగరూడి గ్రామాల్లో పలుమార్లు విషపు కొక్కులు తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడిన వారి సంఖ్య నమోదు అయ్యింది.  
 
‘కల్లు’కూట విషం:   కల్లు జీవితానికి ముల్లు...అనే సామెత మన్యంలో అక్షరాల నిజమవుతోంది.  జీలుగుకల్లులో అధికంగా నేలసిర్లి, పాతాలగరడి, సీమతీగ, కటికి, రెల్ల, పలుదొండ వంటి వేర్లు అధికంగా మురగదీస్తూ వినియోగిస్తుండడం వల్ల వారిలో వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా సన్నగిల్లుతోంది. లివర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు ముసురుకొంటున్నాయి. అయినా గిరిజనులకు ఎంతో ప్రీతిపాత్రమైన జీలుగుకల్లు వినియోగంలో వెనకడుగు వేయడం లేదు.
 
 మడ్డికల్లులో  కూడా అనేక రకాల వనమూలికలు, రసాయనాల
 తో తయారు చేసే పిండి ఉండలు కలపడంతో అది కాలకూట విషంలా తయారవుతోంది. దీనిని సేవించేవారు మృత్యుకోరలకు చిక్కుతున్నారు.
 
‘దుంప’తెంచుతున్న నిల్వ...
 నాగడ దుంప, సీమదుంప, పిండిదుంప, చారుదుంప, గుమ్మడి కాయ వంటివి సీజన్‌లో సేకరించి వాటిని ఎండ బెట్టి నిలువ చేసి అధికంగా గిరిజనులు వినియోగిస్తుంటారు. అయితే వీటిని ఉడకబెట్టడంలోగాని, ఎండ పెట్టడంలోను సరైన జాగ్రత్తలు చేపట్టకపోవడంతో అవి త్వరి త గతిన బూజుపడతాయి.  అయినా ఏ మాత్రం లెక్కచేయక తిరిగి వాటినే వినియోగిస్తుండడం వల్ల డయేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు.  
 

‘మాంసా’హరణం :  నాణ్యత లోపించిన, వ్యాధుల బారిన పడిన పశుమాంసం వారపు సంతల్లో విచ్చలవిడిగా విక్రయిస్తుంటారు. మృతి చెందిన పుశువులు, మేకలను నిల్వచేసుకుంటూ తింటుండడం వల్ల పలువురు మృత్యువాత పడుతున్నారు...లేదా ఆంత్రాక్స్ వంటి వ్యాధులు కొనితెచ్చుకుంటున్నారు.  
 

మరిన్ని వార్తలు