ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు

21 May, 2020 05:22 IST|Sakshi

కంటైన్మెంట్‌ జోన్లు మినహా అన్ని చోట్లా దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరవొచ్చు

కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు పరిస్థితిని సమీక్షించి కార్యాచరణ చేపట్టాలి

తప్పనిసరి జాగ్రత్తలతో అనుమతులు

మార్గదర్శకాలు జారీ చేసిన పురపాలక శాఖ

సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. మే 31 వరకు ప్రకటించిన నాలుగో విడత లాక్‌డౌన్‌లో జిల్లా కలెక్టర్లు కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో మినహా ఇతర పట్టణాల్లో ఎంపిక చేసిన దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరిచేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిధిలో పరిస్థితిని సమీక్షించి దుకాణాలు తెరిచేందుకు కార్యాచరణ చేపట్టాలని పేర్కొంది. వాటిని పురపాలక, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, పరిశ్రమలు, మార్కెటింగ్, మత్స్య, రవాణా శాఖలు పాటించాలని చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో అనుమతించిన దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరవొచ్చు. మందుల దుకాణాలకు మరింత సమయం అనుమతిస్తారు.

దుకాణ యజమానులదే బాధ్యత
► దుకాణాల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఆ బాధ్యత దుకాణ యజమానులదే. అందుకోసం దుకాణాల లోపల, బయట వృత్తాకార మార్కింగులు వేయాలి. దుకాణాల లోపల గరిష్టంగా ఐదు మందికి మించి అనుమతి లేదు. అక్కడ పనిచేసేవారు, కొనుగోలుదారులు కచ్చితంగా మాస్కులు ధరించాలి.
► దుకాణాలను రోజు తెరిచే ముందు ప్రవేశ ద్వారాలు, బయటకు వేళ్లే ద్వారాలు, పార్కింగ్‌ ప్రదేశాలు, లిఫ్టులలో శానిటేషన్‌ చేయాలి. తలుపుల హ్యాండిళ్లు, రైలింగులు, లిఫ్ట్‌ బటన్లు మొదలైనవి ఎర్ర రంగుతో మార్కింగ్‌ చేసి తరచూ శానిటేషన్‌ చేయాలి. టాయిలెట్లలో శానిటైజేషన్‌పై శ్రద్ధ చూపించాలి.
► అన్ని దుకాణాలు 50% సిబ్బందితోనే పనిచేయాలి.
► దుకాణాల్లో పనిచేసే సిబ్బంది అందరూ తమ మొబైల్‌ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వృద్ధులు, చిన్న పిల్లలను వీలైనంతవరకూ దుకాణాల్లోకి అనుమతించకూడదు.
► ఉన్నంత వరకు దుకాణాల్లోకి ప్రవేశించేందుకు, బయటకు వచ్చేందుకు ద్వారాలు వేర్వేరుగా ఉండాలి.
► ఎక్కువ బిల్లింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేయాలి. వీలైనంతవరకు నగదు రహిత లావాదేవీలకే ప్రాధాన్యమివ్వాలి.
అనంతపురం పాతవూరులో షాపులు  తెరవడంతో మొదలైన సందడి  

వీటికి ప్రత్యేక అనుమతి
► స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్టేడియంలు తెరిచేందుకు అనుమతిచ్చారు. క్రీడాకారులు, శిక్షకులకు మాత్రమే ప్రవేశం ఉంది. సందర్శకులను అనుమతించరు.
► ఆహార పదార్థాలను డోర్‌ డెలివరీ చేసే, టేక్‌ అవే సదుపాయం ఉన్న రెస్టారెంట్లకు అనుమతి. అలాగే వైద్య, ఆరోగ్య, పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం, వలస కార్మికులు, విదేశీ టూరిస్టులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో వారికి ఆహార పదార్థాలు అందించేందుకు ఉద్దేశించిన హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి.
► బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో ఉన్న క్యాంటీన్లకు అనుమతి ఉంది.

 తెరిచేందుకు అనుమతిలేనివి
► సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్, ఎస్లాబ్లిష్‌మెంట్‌ పార్కులు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు, బంగారు ఆభరణాలు, బట్టలు, చెప్పుల దుకాణాలు.

ప్రత్యేక చర్యలతో సెలూన్లకు అనుమతి
► స్పాలు, మసాజ్‌ సెంటర్ల నిర్వహణకు అనుమతి లేదు. కానీ సెలూన్లకు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. అందుకోసం వారు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ఎక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు, తక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం వేర్వేరుగా నిర్దేశించింది. 

ఎక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు
► సెలూన్లలో పనిచేసే సిబ్బంది, వినియోగదారులకు తప్పనిసరిగా టచ్‌లెస్‌ థర్మోమీటర్లతో టెంపరేచర్‌ పరీక్షించాలి. 99 డిగ్రీల ఫారన్‌హీట్‌ కంటే ఎక్కువ ఉన్న వారిని వెంటనే ఇళ్లకు పంపించేయాలి.
► ప్రతి కస్టమర్‌ పేరు, ఫోన్‌ నంబరుతోపాటు ఏమైనా అనారోగ్య లక్షణాలు ఉంటే నమోదు చేయాలి.
► ముందు అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఈ సెలూన్లను నిర్వహించాలి. తద్వారా సెలూన్‌లోగానీ బయటగానీ ఎక్కువ మంది నిరీక్షించకుండా నివారించవచ్చును. 
► సెలూన్‌ లోపల కస్టమర్ల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలి.
► సిబ్బంది ఎల్లప్పుడూ మాస్కులు ధరించాలి. డిస్పోజబుల్‌ గ్లౌజులు ధరించాలి. కస్టమర్‌ మారే ప్రతి సారి గ్లౌజులు మార్చాలి. వీలైతే కళ్లద్దాలు, ఫేస్‌ షీల్డు ధరించాలి.
► సెలూన్‌కు వచ్చే కస్టమర్లు కూడా క్షవరం చేయించుకునే సమయంలో తప్ప నిరీక్షించే సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలి.
► సెలూన్లలో వాడే అన్ని పరికరాలు, ఉపకరణాలు డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ చేయించి శుభ్రంగా ఉండాలి. ప్రతి కస్టమర్‌కు ప్రత్యేకంగా మెడ చుట్టూ వేసే వస్త్రం, టవల్, హెయిర్‌ క్యాప్‌ మొదలైనవి ప్రతి కస్టమర్‌కు ప్రత్యేకంగా వాడాలి. ఒకరికి వాడిన రేజర్లను మళ్లీ వాడకూడదు. 
► సెలూన్లలోని కుర్చీలు, ఇతర ఫర్నిచర్, అద్దాలతోపాటు టాయిలెట్లు, బాత్‌రూంలు, సింకులను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి. సెలూన్‌ను రోజూ తెరిచే ముందు, మూసివేసిన తరువాత  మెట్లతోసహా సోడియం హైపో క్లోరైట్‌ పిచికారీ చేయాలి.

తక్కువ బడ్జెట్‌తో నిర్వహించే సెలూన్లు..
► అనారోగ్య లక్షణాలు ఉన్న వారిని అనుమతించకూడదు.
► సెలూన్‌లో పనిచేసేవారు తప్పనిసరిగా మాస్కు, గ్లౌజులు ధరించాలి.
► కస్టమర్లు ఎవరికి వారు టవల్, అవసరమైన ఇతర వస్త్రాలు తెచ్చుకోవాలి.
► ప్రతి కస్టమర్‌కు క్షవరం చేసిన తరువాత కుర్చీ, ఇతర ఫర్నిచర్‌ను తప్పనిసరిగా డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ చేయాలి. రేజర్లను ఒకసారే వాడాలి.
► సెలూన్‌లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.
► కస్టమర్ల వివరాలను నమోదు చేసేందుకు ఓ రిజిస్టర్‌ను నిర్వహించాలి. 

మరిన్ని వార్తలు