రసాభాస

25 Oct, 2014 00:36 IST|Sakshi
రసాభాస
  • నోరుపారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే
  •  నిలదీసినవైఎస్సార్‌సీపీ సభ్యులు
  •  అరుపులు, కేకలతో సాగిన జెడ్పీ సమావేశం
  •  తుపాను నష్టంపై చర్చ నామమాత్రం
  • తుపాను బాధితులకు పునరావాసం, పరిహారం విషయమై చర్చిం చాల్సిన జెడ్పీ సాధారణ సమావేశం నామమాత్రంగా సాగింది. పరస్పర దూషణలతో రసాభాసగా మారింది. ఒక్క తీర్మానం చేయలేదు. ఎందుకు సమావేశం నిర్వహించారో, ఏ సమస్యకు పరిష్కార మార్గం చూపించారో ఎవరికి తెలియదు. చైర్‌పర్సన్ నడిపించాల్సిన సభను నిబంధనలకు విరుద్ధంగా అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు వేదికపై కూర్చొని అంతా తానై వ్యవహరించారు. కీలకమైన సమావేశంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కేవలం 10 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయారు. మరో మంత్రి అయ్యన్నపాత్రుడు అసలు హాజరుకాలేదు. తుపాను కారణంగా నష్టపోయిన ఏజెన్సీ మండలాల్లో గిరిజన సమస్యలపై చర్చించాలని కోరిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుపై టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు విరుచుకుపడ్డారో, అందులో తప్పేముందో ఎవరికీ అర్థం కాలేదు.
     
    విశాఖ రూరల్ : జిల్లా పరిషత్ సాధారణ సమావేశం నామమాత్రంగా సాగింది. తుపాను కారణంగా కష్టాల్లో ప్రజలు ఉన్న నేపథ్యంలో నిర్వహించిన జెడ్పీ తొలి సాధారణ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా.. ఒక్క అంశంపై కూడా సుదీర్ఘ చర్చ జరగలేదు.పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఒక సందర్భంలో  అనుచిత వ్యాఖ్య చేయడంతో సభలో పెద్ద దుమారమే లేచింది. ఈ కమంలో  అజెండా ప్రారంభించినప్పటికీ ఒక్క అంశంపై కూడా పూర్తిస్థాయిలో చర్చించలేదు. స్థానిక సమస్యలపై మాట్లాడాలని ప్రయత్నించినా జెడ్పీటీసీలకు ఎమ్మెల్యేలు అవకాశమివ్వకపోవడం పట్ల టీడీపీ సభ్యులే సభలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం అయిదు అంశాలపై పదేసి నిమిషాలు అధికారుల నివేదికలు విని అర్ధంతరంగా సమావేశాన్ని ముగించారు.
     
    బాధితులకు సహాయ సహకారాలు అందిస్తాం

    సమావేశం ప్రారంభమైన తరువాత తుపానులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతూ సభ్యులు మౌనం పాటించారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ తుపానులో నష్టపోయిన బాధితులకుందరికీ ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. తుపాను వచ్చిన రెండు రోజునే జిల్లాకు వచ్చి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టిన సీఎం చంద్రబాబునాయుడుకు, తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశాన్ని వేగంగా ముగించడానికి సభ్యులు సహకరించాలని ఆమె కోరగా.. దారుణమైన విపత్తుకు ప్రజలు నష్టపోయారని, కష్టాల్లో ఉన్నారని, సుదీర్ఘంగా చర్చ జరిగి వారి సమస్యలు పరిష్కరించాలని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు సూచించారు.
     
    దుమారం రేపిన బండారు వ్యాఖ్యలు

    తుపాను బాధితుల సమస్యలపై చర్చించాలని అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కోరగా.. వెంటనే పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర స్వరంతో ఒంటికాలిపై లేచారు. ఏమి మాట్లాడుతున్నారో తెలియకుండా.. పెద్దగా కేకలు వేస్తూ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. అజెండాపై మాత్రమే చర్చించాలని డిమాండ్ చేశారు.

    ఈ విషయంలో జరిగిన వాగ్వివాదంలో ఎమ్మెల్యే కిడారితో మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యానం చేయడం పెద్ద దుమారాన్ని దారి తీసింది. పరిస్థితి ఇరు పార్టీల సభ్యుల మధ్య తోపులాటల వరకు వెళ్లింది. తుపాను బాధితుల సమస్యల పరిష్కారం కోసం చర్చించాలని కోరితే.. గిరిజన ఎమ్మెల్యే అయిన తనను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ కిడారి సర్వేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తూ కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కింద కూర్చున్నారు.
     
    సభలో అమర్యాదగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని, తుపాను బాధితుల సమస్యలపై చర్చించాలంటూ నినాదాలు చేశారు. కిడారిని ఉద్దేశించి బండారు వ్యాఖ్యలు చేయలేదని టీడీపీ సభ్యులు సర్ధిచెప్పే ప్రయత్నం చేయగా మరి ఎవరిని ఉద్దేశించి అన్నారో చెప్పాలని వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు ప్రశ్నించారు.

    ఇంతలో బండారు మాట్లాడుతూ తాను అలా అనలేదని, తాను తప్పుగా మాట్లాడితే క్షమాపణ చెబుతానన్నారు. సమస్యలపై అజెండాలో చర్చిద్దామని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చైర్‌పర్సన్ లాలం భవాని చెప్పడంతో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు తిరిగి వారి సీట్లలో కూర్చున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, పీలా గోవింద సత్యనారాయణ, పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు