9 జిల్లాలకు తుపాను హెచ్చరిక

9 Oct, 2013 19:15 IST|Sakshi
9 జిల్లాలకు తుపాను హెచ్చరిక

హైదరాబాద్: వాతావరణ శాఖ 9 జిల్లాలకు తుపాను హెచ్చరిక చేసిన నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.  తుపాను తీరాన్ని దాటే సమయంలో 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుదని చెప్పారు.

సచివాలయంలో కంట్రోల్ రూం ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు.  కంట్రోల్ రూం ఫోన్ నెంబర్లు 040-23451034, 23546005. ముందు జాగ్రత్తగా అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఒక హెలీకాఫ్టర్ కూడా సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఆర్మీ, నేవీ సిబ్బంది సహకారం కూడా కోరినట్లు తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని 9 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా, ఒడిస్సా, కోస్తా జిల్లాలలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు  చెప్పారు.  తుపాను ప్రభావం వల్ల సముద్రంలో సాదారణం కంటే అలలు ఎగిసిపడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాని చెప్పారు. వాయుగుండం విశాఖకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
విశాఖపట్నం, కళింగపట్నం, నిజాంపట్నంలలో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.  ఈ రాత్రికి తుఫాను ఫైలిన్ తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. విశాఖ-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఉత్తరాంధ్రతోపాటు కోస్తా జిల్లాలైన తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు