కన్నీటితో కడుపు నింపలేక.. 

13 Feb, 2020 10:13 IST|Sakshi

మందులు కొనడమనే మాట మర్చిపోయి అన్నం పెడితే చాలు అనుకునే స్థితికి వచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలనే ఆలోచన వదిలేసి ఆ పూటకు కడుపు నింపితే అదే పదివేలు అనుకుంటున్నారు. పిల్లలు పుట్టడం, వారు చక్కగా ఎదగడం.. పేదల బతుకుల్లో కనిపించే సంతోషాలివే. కానీ ఆ దంపతులకు ఈ సంతోషం కూడా మిగల్లేదు. కడుపున పుట్టిన బిడ్డ కదల్లేక మంచంపై పడి ఉంటే కనీసం చికిత్స కోసం ఆలోచన చేయలేని దుస్థితి వారిది. కూలికి ఒకరు.. బిడ్డ వద్ద కాపలాకు మరొకరుగా ఉంటూ బతుకీడుస్తున్నారు. కూలి డబ్బులతో కుటుంబం గడవడం కష్టమవుతున్న తరుణంలో బిడ్డ భవిష్యత్‌ కోసం చేతులు చాచి సాయం కోరుతున్నారు. శ్రీకాకుళం ఇచ్ఛాపురం మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మ దంపతులు చేస్తున్న అభ్యర్థన ఇది.

సాక్షి, ఇచ్ఛాపురం : శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కొఠారీ గ్రామానికి చెందిన దువ్వు తులసయ్య, తోయమ్మలకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు మోహనరావు. కొడుకు పుట్టగానే తమకు వంశోద్ధారకుడు పుట్టాడన్న సంతోషంతో ఆ దంపతులు మురిసిపోయారు. 7వ తరగతి వరకు ఎంతో చలాకీగా ఉన్న మోహనరావు ఆ తర్వాత ఒక్కసారిగా నీరసించిపోయాడు. కాళ్లు ముందుకు పడకపోవడం, చేతుల్లో చలనం లేకపోవడంతో మంచానికే పరిమితమైపోయాడు. కూలి చేసుకుని బతికే ఆ దంపతులకు కొడుకు పరిస్థితి అర్థం కాలేదు. అప్పులు చేసి మరీ విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, బరంపురం ఆస్పత్రులకు తిప్పారు. అయినా ఫలితం కనిపించలేదు. రోజూ కూలి పనికి వెళ్తే గానీ వారి కడుపు నిండదు. ఇలాంటి పరిస్థితుల్లో రూ. లక్షలు ఖర్చు పెట్టి కుమారుడికి చికిత్స చేయించడం వారికి అసాధ్యమైపోయింది.  


ఎదిగొచ్చిన కొడుకుకు తల్లి తోయమ్మ చిన్నపిల్లాడిలా సపర్యలు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో 64 శాతం అంగ వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఉండగా,స్థానిక టీడీపీ నేతలు కేవలం వెయ్యి రూపాయలు పింఛన్‌ ఇప్పించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దివ్యాంగులకు రూ.3 వేలు అందిస్తున్నారు. అయితే తల్లిదండ్రులిద్దరూ ఒకప్పుడు కూలికి వెళ్లేవారు. కానీ మోహనరావు పరిస్థితి మారినప్పటి నుంచి ఒకరు బిడ్డ వద్ద ఉంటే మరొకరు పనికి వెళ్తున్నారు. ఒకరి కూలి డబ్బులతో కుటుంబం గడవడం, మోహనరావుకు మందులు కొనడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దంపతులు సాయం కోరు తున్నారు. బిడ్డ భవిష్యత్‌ను కాపాడడానికి దాతలు చేయూతనిస్తారని ఆశ పడుతున్నారు. సాయమందించాలనుకునే వారు 90590 67952 నంబరును సంప్రదించాలని కోరుతున్నారు.   

మరిన్ని వార్తలు