టిక్‌ ట్రాప్‌

4 Aug, 2019 10:44 IST|Sakshi

ఉద్యోగాలు ఊడగొడుతున్న ట్రెండీ యాప్‌

బానిసలవుతున్న యువత

లైక్స్, వ్యూస్‌ కోసం ఎంతకైనా తెగిస్తున్న వైనం

ప్రాణాలు పోతున్నాయి.. ఉద్యోగాలు ఊడుతున్నాయి.. అడవులకు వెళ్లిపోతున్నారు.. కటకటాలపాలవుతున్నారు.. అయినా ఆ పిచ్చి తగ్గడం లేదు సరికదా అంతకంతకూ పెరిగిపోతోంది.. ఒక వైరస్‌లా వ్యాపించేస్తోంది.. అందరినీ తన బానిసలుగా మార్చుకుంటోంది.. అదే ట్రెండీ యాప్‌ ‘టిక్‌ టాక్‌’. దీని మోజులో పడిన యువత మొదట తమ నటనాపాటవాలను ప్రదర్శిస్తూ.. లైక్స్, వ్యూస్‌ తాపత్రయంలో విశృంఖలత్వంలోకి జారిపోతున్నారు. ఇక ఉద్యోగులు తమ పని వేళల్లో సరదా కోసం టిక్‌ టాక్‌ చేస్తూ ఉన్నతాధికారుల ఎదుట దోషులుగా నిలబడుతున్నారు.

విజయవాడలో ఓ పార్టీలో స్నేహితులు కలిశారు. అందులో ఒకరు మీ కూతురు ఏం చేస్తుందని అడగగా యాక్టర్‌గా చేస్తుందన్నారు. ఆ గుంపులోని మరో వ్యక్తి ఎందులో అని ప్రశ్నించగా ‘టిక్‌ టాక్‌’ అని చెప్పాడు. మరి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని అవతలి వ్యక్తిని అడగగా మా అబ్బాయి ఆర్మీలో చేస్తున్నాడని సమాధానం వచ్చింది. ఓహ్‌ ఎక్కడా అని అడగగానే ‘పబ్‌జీ’లో అన్నాడు నవ్వుతూ.. దీంతో ఇద్దరి పరిస్థితి ఒక్కటే అని అక్కడ ఉన్న వారికి అర్థమయ్యింది. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి యాప్‌ బాధితులు ఉంటూనే ఉన్నారు.  ప్రస్తుత ట్రెండీ యాప్‌ టిక్‌ టాక్‌కు బానిసైన వారి పరిస్థితి మరీ ఘోరంగా మారింది.

సాక్షి, అమరావతి  : టిక్‌టాక్‌.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వారుండరు. ఇప్పుడు దీనికున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. టిక్‌ టాక్‌ యాప్‌ డబ్‌స్మాష్‌ యాప్‌ను పోలి ఉండడంతో అందరికీ తక్కువ కాలంలోనే చేరువైంది. ఇందులో మ్యూజికల్‌ వీడియోస్‌తో పాటు డైలాగ్స్, సాంగ్స్‌ ఉండడంతో వాటిని అనుకరించేందుకు పోటీపడుతున్నారు. కొందరు వెర్రి వేషాలు వేస్తూ వాటిని వీడియోలుగా తీసి షేర్‌ చేస్తూ లైకులు, కామెంట్ల కోసం ఎగబడుతున్నారు. లైక్స్, వ్యూస్‌ రావడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. మొదట అందరు మెచ్చుకోవడంతో ఫేమస్‌ అవుతున్నామని మరిన్ని వీడియోలు పెడుతూ అడిక్ట్‌ అవుతున్నారు. దీంతో ఆ తర్వాత ఎలాంటి వీడియోలకైనా తెగిస్తున్నారు. కాగా, కొందరు చేస్తున్న ఫీట్లు ప్రాణాల మీదకి తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల టిక్‌ టాక్‌ వీడియో తీయడం కోసం చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన ఓ యువకుడు శేషాచలం అడవుల్లోకి వెళ్లిపోయాడు. అడవిలో తప్పిపోవడంతో పోలీసులు గాలించి బయటికి తీసుకొచ్చారు.  

ఇప్పుడిదే ట్రెండింగ్‌..
2016లో బైట్‌ డాన్స్‌ అనే చైనీస్‌ ఐటీ కంపెనీ టిక్‌ టాక్‌ యాప్‌ను ప్రారంభించింది. గతేడాది మ్యూజికల్లీ యాప్‌ విలీనం అయ్యాక టిక్‌టాక్‌ విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ యాప్‌ యూత్‌లో బాగా క్రే జ్‌ సంపాదించింది. 2018లో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి అత్యధికంగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో తొలిస్థానంలో నిలిచింది. వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ లాంటి యాప్స్‌ను అధిగమించి ఇప్పుడు టిక్‌ టాక్‌ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా టిక్‌ టాక్‌ వినియోగదారుల్లో అధిక శాతం భారతీయులు ఉండటం గమనార్హం.  

వివాదాలతోనే ముందుకు..
టిక్‌టాక్‌ మొదటి నుంచీ వివాదాలతోనే నడుస్తోంది. టిక్‌టాక్‌ మోజు వికటించి దుష్ఫరిణామాలకు దారితీస్తోంది. అశ్లీల చిత్రాలు, మత పరమైన విధ్వంసాలు, హింసను ప్రేరేపించేలా కొందరు వీడియోలను రూపొందిస్తున్నారు. ఇది దుర్వినియోగం అవుతుండటంతో నిషేధించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ను నిలిపివేయాలని టిక్‌టాక్‌కు నోటీసులు ఇచ్చింది. దీంతో కొన్ని రోజులపాటు ఈ యాప్‌ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ కాలేదు. ఆ తర్వాత సదరు సంస్థ సుప్రీం కోర్టుకు వెళ్లడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో మళ్లీ టిక్‌టాక్‌ అందుబాటులోకి వచ్చింది. ఇటీవల ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాల్లోనే టిక్‌ టాక్‌  వీడియోలు చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ యాప్‌ను వారి రాష్ట్రంలో బ్యాన్‌ చేయాలని కేంద్రాన్ని కోరింది.

మంచికంటే చెడు ఎక్కువ..
షార్ట్‌ వీడియో మెసేజ్‌ యాప్‌ టిక్‌ టాక్‌ వచ్చాక ప్రయోజనాల కంటే నష్టాలు, అనర్థాలే ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కొంత మందికి మాత్రం తమ నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఉపకరిస్తోందని చెప్పవచ్చు. వేలకు వేలు ఖర్చుపెట్టి షార్ట్‌ఫిలింలు చేయలేని వారు ఒక చిన్న వీడియోతో క్రియేటివిటీని నిరూపించుకుంటున్నారు. టిక్‌టాక్‌ వీడియోలతో సెలబ్రెటీలు అవుతున్నారు. కాగా యాప్‌లో అప్‌లోడ్‌ చేసిన వీడియోలను కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారు. సదరు వీడియోలను మార్ఫింగ్‌ చేస్తున్నారు.  

డ్యూటీలు వదిలేసి, టిక్‌టాక్‌లో మునిగి..
బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి, విధులను మరిచి వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సేవ చేయకపోగా, ఆఫీసుల్లో కాలక్షేపం చేస్తున్నారు. వారం రోజుల్లో పలు టిక్‌టాక్‌ సంఘటనలు బయటికి వచ్చాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్‌లో ఉద్యోగులు, సిబ్బంది చేస్తున్న టిక్‌టాక్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోగా, మరికొందరికి నోటీసులు జారీ చేశారు.

ఇవిగో సంఘటనలు..  
► విశాఖపట్నంలో పోలీస్‌ వాహనంలోనే శక్తి టీం కానిస్టేబుళ్లు టిక్‌టాక్‌ చేస్తూ దొరికిపోయారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి, వీడియో చేసిన వారిపై చర్యలు తీసుకున్నారు. 
► అనంతపురం జిల్లా కదిరి ఏరియా ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్లు ల్యాబ్‌లో టిక్‌ టాక్‌ వీడియో చేయడంతో అది కాస్త వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ల్యాబ్‌ టెక్నీషియన్లపై చర్యలు తీసుకున్నారు. 
► గుజరాత్‌లోని లాంఘజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌ అర్పిత టిక్‌టాక్‌ చేయడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసేశారు.
► ఏపీకి చెందిన 20 ఏళ్ల విద్యార్థి టిక్‌టాక్‌ యాప్‌లో సీఎం కేసీఆర్‌పై దూషిస్తూ వీడియోను అప్‌లోడ్‌ చేయడంతో అరెస్ట్‌ చేశారు.

ఫేమస్‌ అవుతుండటంతో బానిసలవుతున్నారు..
టిక్‌ టాక్‌లో పాపులారిటీ కోసం యువత వీడియోలు పెట్టడం ప్రారంభిస్తున్నారు. లైక్స్, వ్యూస్‌ రావడంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. టీనేజర్లు, యువత అందులో ఉండే వ్యతిరేక భావాలను చూడకుండా వీడియోలు అప్‌లోడ్‌  చేస్తున్నారు. హద్దు మీరనంత వరకూ అన్నీ బాగుంటాయి. హద్దు మీరి వీడియోలు చేస్తే ట్రోలింగ్‌ బారిన పడుతున్నారు. ఇతరులతో బేరీజు వేసుకుని లైక్స్, వ్యూస్‌ రాకపోవడంతో మానసికంగా కుంగి పోతున్నారు. 
– డాక్టర్‌ టీఎస్‌ రావు, మానసిక నిపుణులు, విజయవాడ

మరిన్ని వార్తలు