చెరసాలలో జల్సా

23 Sep, 2014 14:27 IST|Sakshi
చెరసాలలో జల్సా

శిక్షలో భాగంగా జైలుకు వచ్చిన ఖైదీలు మహా జల్సాగా గడుపుతున్నారు. అది సబ్ జైలు నుంచి సెంట్రల్ జైలు వరకు ఎక్కడైనా ఖైదీల జల్సానే జల్సా. జైళ్లలో ఖైదీల వద్ద గుట్కా, బిర్యానీ ప్యాకెట్ల నుంచి మందు బాటిళ్లుతోపాటు నీలి చిత్రాలతో కూడిన పెన్ డ్రైవ్లు, సెల్ ఫోన్లు ఖైదీల వద్ద విరివిగా ఉంటున్నాయి. అయితే తనిఖీలకు వచ్చిన జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఖైదీల వద్ద దొరికిన వస్తువులు చూసి బిత్తరపోతున్నారు. అయితే తనకు బెయిల్ కావాలంటూ ఓ ఖైదీ చర్లపల్లి సెంట్రల్ జైలులో నుంచి ఓ న్యాయవాదికి తరచు ఫోన్ చేసి విసిగిస్తున్నాడు.

దీంతో ఖైదీగారి బెయిల్ గోల నుంచి ఉపశమనం పొందెందుకు ఓ చానెల్ను ఆశ్రయించాడు. దీంతో సోమవారం సెంట్రల్ జైలు నుంచి ఖైదీ ఫోన్ చేయడం.... న్యాయవాది సమాధానం అంతా ఆ చానల్ ప్రత్యక్ష ప్రసారం కావడంతో జైళ్ల శాఖ ఉన్నతాధికారులు మరోసారి ఉలుక్కిపడ్డారు. దీంతో మరోసారి చర్లపల్లి జైలులో మళ్లీ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీల వద్ద నుంచి ఆరు సెల్ ఫోన్లుతోపాటు 50 గ్రాముల గంజాయి ఉన్నతాధికారులు గత అర్థరాత్రి స్వాధీనం చేసుకున్నారు.

ఇవన్ని ఎక్కడవని ఉన్నతాధికారి ప్రశ్నించినా.. ఖైదీల నుంచే కాదు జైలు సిబ్బంది నుంచి కూడా సమాధానం కరువైంది. దీంతో జైళ్ల శాఖ ఉన్నతాధికారి ఆగ్రహాం కట్టలు తెంచుకుంది. మీ ప్రమేయం లేకుండా 'ఇవన్నీ' జైళ్లల్లోని ఖైదీలకు ఎలా వస్తున్నాయని అని ప్రశ్నించినా... సదరు జైలు ఉన్నతాధికారుల నుంచి సమాధానం మాత్రం పెదవి దాటడం లేదు. జైలు సిబ్బంది... ఖైదీలు అనుబంధంతో జైళ్ల శాఖలో వార్డర్ నుంచి ఉన్నతాధికారి వరకు కోట్లకు పడగలెత్తుతున్నారు. జైళ్ల శాఖలో అవినీతి చూసి ఆ శాఖ ఐజీనే ఏదో చేద్దామని పోలీసు సర్వీసులోకి వచ్చినా ఏమీ చేయలేక పోతున్నామని స్వయానా ఆయనే ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జైళ్ల శాఖలో అవినీతి ఎంతగా మేట వేసిందో ఇటే అర్థమైపోతుంది.

మరిన్ని వార్తలు