గంటాకు స్నేహ'పాత్రుడ్ని'

14 Jun, 2014 15:29 IST|Sakshi
గంటాకు స్నేహ'పాత్రుడ్ని'

శత్రువులను మిత్రులుగా... మిత్రులను శత్రువులుగా మార్చే మహత్తు ఒక్క కాలానికే ఉంది. అందుకే శాశ్వత శత్రుత్వం, కానీ శాశ్వత మిత్రత్వం కానీ ఉండదని అంటారు.విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యనపాత్రుడి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న విషయం అందరికి సంగతి తెలిసిందే. అయితే ఆ ఇద్దరిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్లోకి తీసుకున్నారు. దాంతో ఆ ఇద్దరి నేతల మధ్య  గొడవలు సద్దుమణిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం తన చిరకాల ప్రత్యర్థి గంటా శ్రీనివారావుతో కలసి పని చేస్తాంటూ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించేశారు. దాంతో గతంలో ఇద్దరు నేతలు ఒకరిపై ఒక్కరు దుమ్మొత్తి పోసుకున్న సంగతి గుర్తు చేసుకుంటూ ఇరు నాయకుల అనుచరగణం చెవులు కొరుక్కుంటున్నారు.

అసలు కథలోకి వద్దాం ...టీడీపీ స్థాపించిన నాటి నుంచి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆ పార్టీలోనే కొనసాగారు. నర్సీపట్నం నుంచి పలుమార్లు అసెంబ్లీకి, ఒక్కసారి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. అయితే ప్రకాశం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు విశాఖకు వలస వచ్చారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్లో కాంట్రాక్ట్ పనులు చేపట్టి అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదగారు. 1999లో గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరారు. అదే సంవత్సరం అనకాపల్లి నుంచి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు.

అయితే ప్రముఖ టాలీవుడ్ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) స్థాపించారు. దాంతో టీడీపీకి గుడ్ చెప్పి గంటా పీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చిరంజీవి కొన్ని షరతులతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. దాంతో గంటా వారి స్టార్ గణగణమంటు మోగిపోయింది. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో ఓడరేవులు, ఎగుమతులు, మౌలిక సదుపాయాల శాఖను గంటా నిర్వహించారు.

కాగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దాంతో మళ్లీ గంటా గాలి టీడీపీ వైపు మళ్లీంది. అందుకోసం గంటా తన ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. టీడీపీలో చేరేందుకు గంటాకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పచ్చ జెండా ఊపారు. అంతలో గంటా పార్టీలోకి తీసుకోవడానికి వీలేదంటూ అయ్యన్నపాత్రడు సైంధవుడిలా బాబు కాళ్లకు అడ్డుపడ్డారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వదలి వెళ్లిన వారిని... మళ్లీ పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ అయ్యన్నపాత్రుడు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును నిలదీశాడు.

గంటా పార్టీలోకి వస్తే తాను పార్టీకి నీళ్లు వదలాల్సి ఉంటుందంటూ చంద్రబాబును అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగి అయ్యన్నపాత్రుడ్ని సముదాయించారు. అయినా అయ్యన్నపాత్రుడు మెత్తబడలేదు. సరికద ఎన్నికలు... ఎన్నికల ఫలితాల తర్వాత కూడా గంటా అంటే అయ్యన్నపాత్రుడు తోకతొక్కిన తాచులా అంత ఎత్తు లేచేవాడు. అయితే చంద్రబాబు తన కేబినెట్లోకి గంటాను మాత్రమే తీసుకుంటాడని తనను తీసుకోరని అయ్యన్నపాత్రుడు ఒకానొక దశలో నిరాశకు లోనయ్యారు. అయితే చంద్రబాబు కేబినెట్లో గంటాతోపాటు తనకు చోటు దక్కడంతో అయ్యన్నపాత్రుడు తెగ ఖుషీ అయిపోయాడు. దాంతో రాష్ట్రాభివృద్ధికి గంటాతో కలసి పనిచేస్తాంటూ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.

మరిన్ని వార్తలు