ముచ్చటగా మూడోవాడు!

26 Aug, 2014 15:23 IST|Sakshi
ముచ్చటగా మూడోవాడు!

ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ సహాయమంత్రి సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. దాంతో ఆ రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్న ముచ్చటగా మూడో అచ్చ తెలుగువ్యక్తి సిహెచ్. విద్యాసాగరరావు. ఇప్పటికే ఇద్దరు తెలుగు వ్యక్తులు మహారాష్ట్ర గవర్నర్ పదవిని అలంకరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన ప్రభాకర్ రావు (ప్రముఖ సినీ మాటల రచయిత కోన వెంకట్ తాతగారు) మహారాష్ట్ర గవర్నర్ పదవిని చేపట్టిన మొట్టమొదట తెలుగు వ్యక్తి. దాదాపు ఏడాదిపైగా ఆయన ఆ పదవిలో కొనసాగారు.

ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఆ పదవిని అలంకరించిన రెండో వ్యక్తి. ఆయన రెండేళ్ల వరకు ఆ పదవిలో ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తెలుగు వ్యక్తి సిహెచ్ విద్యాసాగరరావు ఆ పదవిని చేపట్టనున్నారు. బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహారించిన విద్యాసాగరరావు... రెండు సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాగే సమైక్య ఆంధ్రప్రదేశ్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం విదితమే.  

గతంలో ఎన్డీఏ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వి. రామారావును సిక్కిం గవర్నర్గా నియమించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ 282 సీట్లు కైవసం చేసుకుంది. దాంతో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యూపీఏ ప్రభుత్వ హాయాంలో నియమించిన గవర్నర్లకు మంగళం పాడుతూ వారి స్థానాల్లో బీజేపీ నాయకులను గవర్నర్ పదవుల్లో నియమించే కార్యక్రమంలో భాగంగా విద్యాసాగర్ రావు ఎంపిక జరిగింది.

మరిన్ని వార్తలు