గ్యాలరీలో మాజీ సీఎం చంద్రబాబు

22 Jan, 2020 22:02 IST|Sakshi

సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికార వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి శాసనమండలిలో బుధవారమంతా హైడ్రామా నడిచింది. ప్రభుత్వ ప్రతిపాదిత ఈ బిల్లుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు అడుగడుగునా అడ్డుతగలడంతో పలు దఫాలు సభ వాయిదా పడూతూ కొనసాగింది. నిబంధన 71 ప్రకారం ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరగాలన్న పట్టుదలతో ప్రతిపక్షం సమావేశాలను అడ్డుకుంది. చివరకు నిబంధన 71 పై సభలో చర్చ చేపట్టిన అనంతరం ప్రభుత్వం ప్రతిపాదించిన వికేంద్రీకరణ బిల్లుపై సభ ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేయాల్సిన తరుణంలో మండలి చైర్మన్ అనూహ్యంగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

ఈ మొత్తం పరిణామంలో విచిత్రమైన అంశమేమంటే... 4 దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకునే ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చొని వీక్షించడం. ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా గ్యాలరీలో కూర్చొని సభా కార్యక్రమాలను పర్యవేక్షించడం బహుశ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇకపోతే మధ్య మధ్యలో తన చాంబర్‌కు వెళుతూ పార్టీ నాయకులతో సమావేశమై కార్యక్రమాలను అడ్డుకోవాలంటూ సూచనలు ఇవ్వడం విడ్డూరం. సభ వాయిదా పడిన తరుణంలో చంద్రబాబు పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమై బాగా అడ్డుకున్నారంటూ వారిని భుజం తట్టారు. ఆ సందర్భంగా కొందరు సభ్యులైతే ఇంకా ముదిరితే చేయి చేసుకునే వారమని కూడా చెప్పడం వీడియోల్లో స్పష్టంగా తెలుస్తోంది. సభా కార్యక్రమాలను అడ్డుకునే విషయంలో ఎవరెవరం ఎలా వ్యవహరించామో? ఏ రకంగా అడ్డుకున్నామో? ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా చెబుతుంటే బాగా చేశారని, మరింతగా అడ్డుకోవాలని చంద్రబాబు సూచించారు. 

సభలో ఎవరేం చేస్తున్నారో టీవీల్లో చూస్తున్నానని మధ్య మధ్యలో గమనిస్తున్నానని వారిని పరోక్షంగా హెచ్చరించారు. చివరగా బుధవారం రాత్రి మండలి తిరిగి సమావేశమైనప్పుడు చంద్రబాబు, ఆయనతో పాటు పలువురు నాయకులు ఏకంగా గ్యాలరీల్లో కూర్చున్నారు. సభ వాయిదా పడేంతవరకు చంద్రబాబు అక్కడే ఉంటూ పక‍్కనున్న నాయకులకు ఎప్పకప్పుడు సూచనలు ఇవ్వడం కనిపించింది. ఈ దశలోనే మండలి చైర్మన్ మహ్మమద్ షరీఫ్ వికేంద్రీకరణ బిల్లుపై తనకున్న విచక్షణాధికారాన్ని వినియోగిస్తూ ఆ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నట్టు ప్రకటించారు. 

ఈ బిల్లును చర్చకు చేపట్టినప్పుడు దాన్ని సెలెక్ట్ కమిటీకి నివేదించాలన‍్న ప్రతిపాదనను ఒక మోషన్ రూపంలో సభ ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. అలాంటి మోషన్ ఏదీ లేనప్పుడు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరంగానీ ఆవశ్యకతగానీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మండలి సమావేశాల కోసం చైర‍్మన్ అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో స్పష్టంగా నిర్ణయాలు తీసుకున్నారు. సభలో అధికార పక్షంకన్నా ప్రతిపక్షం బలం ఎక్కువగా ఉన్న ఇలాంటి సందర్భాల్లో సభలో ఓటింగ్ నిర్వహించి బిల్లు ఆమోదం పొందినట్లో లేదా తిరస్కరించినట్లో చూడాల్సిన బాధ్యత మండలి చైర్మన్ పరిధిలో ఉంటుంది. ఇలా కాకుండా అనూహ్యమైన పరిస్థితులేవైనా తలెత్తినప్పుడు సభలో అన్ని పక్షాల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే సభాపతి ఒక నిర్ణయానికి రావడం ఒక సంప్రదాయంగా వస్తున్నదే కాకుండా ప్రజాస్వామిక విధానం కూడా.  సభా సంప్రదాయాలు, రూల్స్ ఏవీ అంగీకరించని తరుణంలో చైర్మన్ ఖచ్చితంగా అన్ని పార్టీల అభిప్రాయాలను కోరాల్సి ఉంటుంది.  అందులోనూ మెజారిటీ ఉంటేనే బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాల్సి ఉంటుంది. ఇక్కడ అలా చేయకుండా రూల్స్ అంగీకరించనప్పటీ తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించుకుని బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు ప్రకటించడం విచిత్రం. ఈ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నవ్వుతూ వెళ్లడం కనిపించింది.

మరిన్ని వార్తలు