‘పది’ విద్యార్థులకు ఆదాయం కొర్రీ

3 Oct, 2013 03:48 IST|Sakshi
 సాక్షి, నల్లగొండ :ప్రభుత్వ వింత పోకడలతో పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అమలు చేయలేని నిబంధనలతో సర్కారు అయోమయానికి గురిచేస్తోంది. పదో తరగతి పరీక్షల ఫీజు మినహాయింపు పొందడానికి ప్రభుత్వం విధించిన షరతులను చూసి ఉపాధ్యాయులు నవ్వుకుంటున్నారు. వార్షికాదాయం రూ.24 వేలలోపు ఉంటేనే పరీక్ష ఫీజు మినహాయిస్తామని సెకండరీ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జీఓ 109 విడుదల చేసింది. అయితే, వార్షికాదాయం కనీసం రూ.40 వేలకు తక్కువకు తాము ధ్రువీకరణ పత్రం ఇవ్వలేమని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో విద్యార్థులు తప్పనిసరిగా పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 
 
 ఇదీ కొర్రీ....
 2014 మార్చిలో జరగాల్సిన పదో తరగతి వార్షిక పరీక్షల కోసం అక్టోబర్ 20వ తేదీ లోపు ఫీజు చెల్లించాల్సి ఉంది. ఒక్కో విద్యార్థి రూ.125 ఫీజు చెల్లించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు చేస్తూ సర్కారు జీవో జారీ చేసింది. ఇది వర్తించాలంటే పట్టణ ప్రాంత విద్యార్థులకు వార్షికాదాయం రూ.24 వేలలోపు, గ్రామీణ విద్యార్థులకు రూ.20 వేలలోపు వార్షికాదాయం ఉండాలని కొర్రీలు విధించింది. 
 
 తహసీల్దార్ల వాదన...
 తెల్ల రేషన్‌కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం కనీసం 60వేల రూపాయలు, పట్టణ వాసులైతే 70 వేల రూపాయలు మించకూడదు. ఈ నిబంధనల ప్రకారమే కార్డులు జారీ చేస్తున్నారు. అంతేగాక ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందాలంటే వార్షికాదాయం గరిష్ట పరిమితిని రూ.లక్షగా నిర్ధరించారు. ఇది వర్తించాలంటే రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం అందజేయాలన్నా ఇదే కొలమానం. అలాంట ప్పుడు రేషన్ కార్డులో పేర్కొన్న ఆదాయం కంటే తక్కువ చూపెట్టి తాము ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేమని తహసీల్దార్లు అంటున్నారు. ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలే తప్ప... తామేమీ చేయలేమని స్పష్టం చేస్తున్నారు.
 
 నష్టపోతున్న విద్యార్థులు
 జిల్లాలో 586 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 16వేల మంది పదో తరగతి విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో సుమారు 75 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే. అంటే సుమారు 12వేల పైచిలుకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిబంధనలు సవరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అమలు చేయలేని జీఓ ఎందుకు జారీ చేయాలని ప్రభుత్వాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
 
మరిన్ని వార్తలు