జగన్‌కు వెల్లువెత్తుతున్న సంఘీభావం

29 Aug, 2013 01:52 IST|Sakshi
గుంటూరు, న్యూస్‌లైన్ : సమ న్యాయం చేయలేనపుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ చంచల్‌గూడ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు జిల్లా వ్యాప్తంగా సంఘీభావం వెల్లువెత్తుతోంది. ప్రజానీకాన్ని కలుపుకుంటూ ఆ పార్టీ నేతలు రోజుకో రీతిలో జననేత జగన్‌కు తమ మద్దతు తెలుపుతున్నారు. బుధవారం బైక్ ర్యాలీ చేపట్టి  జై జగన్, జైజై జననేత అంటూ నినదించారు. పార్టీ నేతలకు జనగళం జత కలవడంతో జిల్లా అంతటా సమైక్య నినాదం మారుమోగుతూ జగన్‌కు బాసటగా నిలిచారు. 
 
 మరోవైపు జిల్లాలో అమరణ నిరాహారదీక్షలు చేస్తున్న వారి సంఖ్య 14కు చేరింది. ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులో బైక్ ర్యాలీ జరిగింది. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్రాన్ని కాంక్షిస్తూ లక్షపోస్టు కార్డుల ఉద్యమం నిర్వహించారు. వీటిని రాష్ట్రపతికి పంపనున్నట్టు వెల్లడించారు. గుంటూరులో దళిత విభాగం నగర కన్వీనర్ వై. విజయ్‌కిషోర్ ఆధ్వర్యంలో రక్తంతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
 
 ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన.. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండల కన్వీనర్ రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాల ప్రదర్శన నిర్వహించారు. కన్వీనర్ గార్లపాటి ప్రభాకర్ నేతృత్వంలో పట్టణంలోని తాలూకా సెంటర్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెనాలి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త గుదిబండి చినవెంకటరెడ్డి ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. వేమూరు నియోజకవర్గంలో సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో  బైక్ ర్యాలీ నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గంలో సమన్వయకర్త కోన రఘుపతి నాయకత్వంలో పట్టణ కన్వీనర్ దుగ్గమల్లి ధర్మారావు ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాల ప్రదర్శన నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గం తుళ్లూరులో కొమ్మినేని కృష్ణారావు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. తొలుత ద్విచక్రవాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. మంగళగిరిలో దీక్షలను పార్టీ నాయకుడు బొమ్ము సాంబిరెడ్డి ప్రారంభించారు.
 
  నరసరావుపేటలో వైఎస్సార్ సెంటర్ వద్ద సమన్వయకర్త డాక్టరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో  రిలే నిరాహార దీక్షలు జరిగాయి. అనంతరం మోటారు సైకిల్ ప్రదర్శన నిర్వహించారు. వినుకొండ నియోజకవర్గంలో సమన్వయకర్త నన్నపనేని సుధ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ల హారం, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురజాల నియోజకవర్గంలో సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాలతో ప్రదర్శన నిర్వహించారు.  
 
 కొనసాగుతున్న ఆమరణ నిరాహార దీక్షలు 
 జిల్లాలోని గుంటూరు, పొన్నూరు, తెనాలి, పిడుగుగురాళ్లలో అమరణ నిరాహారదీక్షలు చేస్తుండగా, పలు చోట్ల రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. హిందూ కళాశాల వద్ద ఆమరణ నిరాహార దీక్షల్లో ఉన్న వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నగర కన్వీనర్  పానుగంటి చైతన్య, పార్టీ విద్యార్థి విభాగం ఆచార్య నాగార్జున యూనివర్శిటీ కన్వీనర్ తమనం రాజేంద్ర, యండ్రకోట హరికృష,్ణ తెనాలిలో ఆ పార్టీ నాయకుడు గళ్లా చందు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలు బుధవారం నాటికి మూడో రోజుకు చేరాయి. అలాగే వడ్లమూడి వద్ద మాజీ ఎంపీటీసీ సభ్యులు అద్దంకి సుబ్రమణ్యం, ఏడుకొండలు, టి.మస్తాన్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరింది. మందపాటి పద్మావతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మారుపూడి  లీలాధర్ చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష రెండో రోజుకు చేరాయి.  పిడుగురాళ్లలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ చింతా సుబ్బారెడ్డి, చల్లా పిచ్చిరెడ్డి, కుందుర్తి గురవాచారి, గొట్టిముక్కల పవన్‌రెడ్డి చేపట్టిన ఆరమణ నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. పెదకూరపాడులో బెల్లకొండ వీరయ్య ఆమరణ నిరాహారదీక్షకు ఉపక్రమించారు. 
 
 రిలే నిరాహార దీక్షల్లో 800 మంది... 
 జిల్లాలో 800 మంది వరకు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. గుంటూరు రూరల్ జొన్నలగడ్డలో 500 మంది, మిగిలిన నియోజకవర్గాల్లో 300 మంది వరకు ఉన్నారు. 
 
 నేడు మౌనప్రదర్శన - మర్రి
 సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిరంకుశ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా గురువారం జిల్లాలో మౌన ప్రదర్శన నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా కన్వీనరు మర్రి రాజశేఖర్ తెలిపారు. నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావం తెలపాలని కోరారు. బుధవారం ద్విచక్రవాహనాల ర్యాలీని విజయవంతం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
 
>
మరిన్ని వార్తలు