-

బాల్యం..బలి.!

22 May, 2018 11:09 IST|Sakshi
చిత్తు కాగితాలు సేకరించేందుకు వీధుల్లో సంచరిస్తున్న బాలికలు

ఆరేళ్ల వయసు నుంచి 14 ఏళ్ల వయసున్న ప్రతి పిల్లవాడు బడిలోనే ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. బడిఈడు వయసుండే చాలామంది పిల్లలందరూ బడిలో కంటే పనిలోనే అధికంగా ఉంటున్నారు. ఫలితంగా బాలకార్మికులుగా మిగిలిపోతున్నారు. కారణం పేదరికం, కుటుంబ ఆర్థిక పరిస్థితులేనని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత జఠిలంగా ఉంది. పలక బలపం పట్టాల్సిన వయసులో పనుల్లో పడి బాల్యం చితికిపోతోంది.

కడప ఎడ్యుకేషన్‌/రాయచోటి రూరల్‌ : బడి బయట పిల్లలను బడిలో చేర్పించి  బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఎన్ని చట్టాలు ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బడి ఈడు పిల్లలు బాల కార్మికులుగానే మిగిలిపోతున్నారు. ఫలితంగా బడి బయట పిల్లల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలని ఉన్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో సుమారు 30లక్షల జనాభా ఉండగా, అందులో 2లక్షల వరకు బాలలు ఉన్నట్లు అంచనా. అందులో సుమారు 20–25వేల మంది వివిధ ప్రాంతాల్లో  బాల కార్మికులుగా ఉండగా, కొందరు బాలలు భిక్షాటన చేస్తూ, ప్లాస్టిక్‌ కవర్లు సేకరిస్తూ వీధుల్లో సంచరిస్తూనే బడులకు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా ఏటేటా బడి బయట పిల్లలు బాలకార్మికులుగా మారిపోతున్నారు.

కుటుంబ పోషణ భారమవడంతోనే ..
కుటుంబ పోషణ భారమైన పేదలు తమ పిల్లలను పనిలో  భాగస్వాములను చేస్తున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల వారు హోటళ్లు, దుకాణాలు, ఇటుక బట్టీల్లో కూలీలుగా ఉంచుతున్నారు. కొందరు బైక్‌ మెకానిక్‌ షాపుల్లో, మరి కొందరు వెల్డింగ్‌ వర్క్‌ షాపుల్లో, కూల్‌డ్రింక్‌ షాపుల్లో, బరువులు మోసేందుకు పండ్ల మండీల్లో తమ పిల్లలను చేర్చుతున్నారు. ఇంకొందరు తమ పిల్లలను వ్యవసాయపనులు, భవన నిర్మాణ కూలీ పనులు, వస్త్ర దుకాణాల్లో, చిల్లర అంగళ్లలో పనులకు పంపుతున్నారు. గిరిజనులు తమతో పాటు సంచార జీవనానికి వినియోగించుకుంటున్నారు. మరీ వెనుకబడిన వర్గాల వారు పిల్లలను చిత్తుకాగితాలు ఏరుకోవడం తదితర పనులకు వినియోగిస్తున్నారు.

వలస జీవనం దుర్భరం ...
సంచార జీవనంతో ముందుకు సాగే వారు పిల్లలతో పాటు వచ్చి కొందరు ఇక్కడ షాపుల్లో, ఇటుకల బట్టీల్లో పిల్లలను పనుల్లో పెడుతున్నారు. మరి కొందరు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి పెద్దలతో పాటు పిల్లలను కూడా పనుల్లో చేర్పించు కుంటున్నారు. ఇదిలా ఉంటే స్థానికంగా ఉంటున్న ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుండటంతో కూడా బాల కార్మికులు పెరిగిపోతున్నారు. చిన్న పిల్లలను పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమైనా ఈ విషయాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి 14 ఏళ్ల లోపు పిల్లలందరినీ పాఠశాలలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని, వారికి మెరుగైన విద్యను అందించాలని పలువురు కోరుతున్నారు.

సర్వే నిర్వహిస్తున్నాం
జిల్లా వ్యాప్తంగా బడిబయట ఉన్న పిల్లలను గుర్తించేందుకు ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో సెక్టోరియల్‌ అధికారులతోపాటు సీఆర్‌పీలు సర్వే నిర్వహిస్తున్నాం. జిల్లాలో బడిబయట పిల్లలు 3177 మంది ఉన్నట్లు గుర్తించాం. వీరందరిలో 1645 మంది అమ్మాయిలు ఉండగా వీరిలో 800 మందిని  కేజీబీవీలలో చేర్పించనున్నట్లు మిగతా వారిని స్థానిక పాఠశాలల్లో చేర్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. అలాగే మిగతా 1532 మంది బాలురను ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లతోపాటు ప్రత్యేక పాఠశాలల్లో చేర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. జిల్లాలో బడిబయటి పిల్లల కోసం గత ఏడాది 22 నాన్‌రెసిడెన్షియల్‌ స్పెషల్‌ ట్రెయినింగ్‌ సెంటర్లు(ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ) ఏర్పాటు చేశాము. మళ్లీ ఈ ఏడాది మరో 8 కేంద్రాలకు అనుమతులు కోరాం. అలాగే మరో రెండు రెసిడెన్షియల్‌ స్పెషల్‌ ట్రెయినింగ్‌ సెంటర్లను సిద్ధం చేస్తున్నాం.  బడిబయటి పిల్లలందరిని వాటిల్లో ఉంచి విద్యనందిస్తాం. – వెంకట్రామిరెడ్డి. ఎస్‌ఎస్‌ఏ,  ఏఎల్‌ఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌

బాల కార్మిక చట్టాలను పటిష్టం చేయాలి: వసంతాభాయ్, సీడీపీఓ ,రాయచోటి
నేటి సమాజంలో మాన సంబంధాలుతెగిపోవడం వల్ల, తల్లిదండ్రులు విడిపోవడం వల్ల కూడా బాలకార్మికుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిని ఆదరించే బాధ్యత అందరిపై ఉంది. బాల కార్మికులను పనుల్లో పెట్టుకుంటున్న యజమానులను శిక్షించాలి. ప్రభుత్వం చట్టాలను పటిష్టంగా అమలు చేయడం ద్వారానే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించే అవకాశం ఉంది. వీలైనంత వరకు బడి బయట పిల్లలను అంగన్‌వాడీ సెంటర్లలో చేర్పిస్తున్నాము. ప్రజల్లో కూడా మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు