అర్ధరాత్రి ఆయువు తీశాయి!

4 Jun, 2020 12:41 IST|Sakshi

చిన్నారిని బలిగొన్న వీధికుక్కలు

ఆళ్లగడ్డలో ఘటన

కర్నూలు, ఆళ్లగడ్డ: పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి అమానుష ఘటన చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఓ చిన్నారిని వీధికుక్కలు బలితీసుకున్నాయి. ఒకటి కాదు..రెండు కాదు..సుమారు పది కుక్కలు మీదపడి కరిచాయి. చిన్నారి హాహాకారాలు చేస్తున్నా విడిచిపెట్టలేదు.  తీవ్రంగా     గాయపడిన అతన్ని  వైద్యశాలకు తీసుకెళ్లేలోపే ప్రాణాలు  వదిలాడు.  స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన నరసింహ అనే నాలుగేళ్ల  బాలుడికి మతిస్థిమితం సరిగా లేదు. తండ్రి కొన్ని నెలలుగా ఓ కేసులో మచిలీపట్నం జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.   తల్లి వరలక్ష్మి నాలుగు నెలల పాపను తీసుకుని మూడు రోజుల క్రితం ఎక్కడికో వెళ్లింది. నరసింహ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే వదిలివెళ్లింది.

ఈ చిన్నారి అప్పటి నుంచి రోజూ వీధుల వెంట తిరుగుతూ ఎవరైనా ఒక ముద్ద పెడితే తిని..ఇంటి వరండాలో నిద్రపోయేవాడు. మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆకలేసిందో.. ఏమో తెలియదు గానీ ఇంటి గేటు దూకి వీధిలోకి వచ్చాడు. పోలీస్‌ క్వార్టర్స్‌ సమీపంలోని రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. సుమారు 10 కుక్కలుమీద పడి కరిచాయి. శరీరమంతటా గాయపరిచాయి. ముఖ్యంగా తల భాగంలో పీక్కుతిన్నాయి. ఈ క్రమంలో కుక్కల అరుపులు విన్న స్థానికులు బయటకొచ్చి చూశారు. చిన్నారిని కరుస్తున్న దృశ్యాన్ని గమనించి..వెంటనే కర్రలు తీసుకొచ్చి వాటిని తరిమారు. అప్పటికే చిన్నారిని తీవ్రంగా గాయపర్చడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించేలోపే చిన్నారి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామిరెడ్డి తెలిపారు. కాగా.. తల్లి ఎక్కడుందో సమాచారం లేకపోవడంతో బాబాయి ఓబులేసు చిన్నారి అంత్యక్రియలు నిర్వహించాడు.

బాలుడి మృతి బాధాకరం
ఆళ్లగడ్డలో వీధికుక్కల దాడిలో  నరసింహ అనే చిన్నారి చనిపోవడం బాధాకరమని శాసనమండలి విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. వీధికుక్కలను వెంటనే సంహరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబును ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

కుక్కలను సంహరిస్తాం
పట్టణంలో కుక్కల దాడిలో చిన్నారి నరసింహ మృతి చెందడం తమను కలిచివేసిందని ఆళ్లగడ్డ మునిసిపల్‌ కమిషనర్‌ రమేష్‌బాబు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణంలోని వీధి కుక్కలను పూర్తిగా సంహరిస్తామన్నారు. ఈ మేరకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు