అర్బన్ హెల్త్ సెంటర్ల బలోపేతానికి చర్యలు

8 May, 2015 04:25 IST|Sakshi

మురికివాడల్లో నివసించే ప్రజలకు మెరుగైన వైద్యం
అక్రమ నిర్మాణాలపై ఉదాసీనంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
అనధికారిక లేఅవుట్లపై చర్యలకు 9 మందితో కమిటీ
సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ వెల్లడి

 
అరండల్‌పేట (గుంటూరు) : పట్టణాలు, నగరాల్లోని అర్బన్‌హెల్త్ సెంటర్లను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రపురపాలకశాఖామంత్రి పి. నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని పురపాలకసంస్థలు, నగరపాలకసంస్థల ప్రజారోగ్యవిభాగం అధికారులు, పట్టణ ప్రణాళికాధికారులతో గురువారం ఆయన విడివిడిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత ప్రజారోగ్య విభాగం సమావేశంలో మాట్లాడారు.

పురపాలక శాఖలు, కార్పొరేషన్ల వారీగా ఆయా ప్రాంతాల్లో అర్బన్ హెల్త్‌సెంటర్ల వివరాలు, అవి ఎవరి అధీనంలో ఉన్నాయి, ప్రతిరోజూ ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరాలు, పట్టణాల్లోని మురికివాడల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అర్బన్ హెల్త్‌సెంటర్లను బలోపేతం చేయడంతో పాటు మోడల్ అర్బన్ హెల్త్ సెంటర్లుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు.

అర్బన్ హెల్త్ సెంటర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు.  రాష్ట్రస్థాయిలో అర్బన్ హెల్త్‌సెంటర్ల పర్యవేక్షణకు ఒక ప్రత్యేకాధికారిని నియమించడంతో పాటు అన్ని అర్బన్‌హెల్త్ సెంటర్లలో ల్యాబ్‌లు, మందులు ఉండేలా చూస్తామన్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలు కమిషనర్ తీసుకోవాలన్నారు. అనంతరం పట్టణ ప్రణాళికాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కార్పొరేషన్‌లు, పురపాలకసంఘాల పరిధిలో నిర్మించే భవనాలకు అనుమతులను ఆన్‌లైన్‌లో అందించాలన్నారు.

ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. వేగవంతంగా, కచ్చితంగా ప్రజలకు సేవలందించేందుకు ఈ పద్ధతి ఎంతో దోహదపడుతుందన్నారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న అక్రమ కట్టడాలు అవి ఎవరివైనా ఉపేక్షించవద్దని తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి వాటిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలన్నారు.

అనధికారిక లే అవుట్లు, నిర్మాణాలను గుర్తించేందుకు ఐదుగురు లేదా తొమ్మిది మందితో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఒకటి ఏర్పాటు చే స్తామని, వారు రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తనిఖీ చేస్తారని చెప్పారు. 15 రోజుల్లో అనధికార నిర్మాణాలు, అన్‌అప్రూవుడ్ లే అవుట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ పాండురంగారావు, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు