అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు

1 Jun, 2019 03:38 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునరుద్ఘాటన 

కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పరిపాలన 

టెండర్ల విధానం ప్రక్షాళనపై సీఎస్‌తో కలిసి సీఎం సమీక్ష 

అక్రమాలకు తావులేని పారదర్శక టెండర్ల విధానం తీసుకురావాలని ఆదేశం 

ఉద్యోగులు పని వేళల్లోనే కార్యాలయాల్లో విధులు నిర్వహించాలి 

ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేస్తే చాలు 

సాయంత్రం 6 గంటల తరువాత అధికార కార్యక్రమాలు ఉండవు 

సెలవు రోజుల్లో విధులు నిర్వహించాల్సిన అవసరం లేదు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎవరు అవినీతి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని, ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అవినీతి నిర్మూలనే లక్ష్యంగా పరిపాలన సాగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యంతో కలిసి టెండర్ల విధానం ప్రక్షాళనపై సమీక్ష నిర్వహించారు. టెండర్ల విధానంలో పారదర్శకత తీసుకురావాలని, అవినీతికి తావు లేకుండా సమూల మార్పులు చేయాలని పేర్కొన్నారు. కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీవోటీ) ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ జరిగిప్పటికీ, అస్మదీయులకే కాంట్రాక్టులు దక్కేలా నిబంధనలు మార్చడం, అంచనా వ్యయాలు విపరీతంగా పెంచేసి, కమీషన్లు కొల్లగొట్టడం లాంటి బాగోతాలు ఇప్పటిదాకా యథేచ్ఛగా కొనసాగాయి. ఇకపై ఇలాంటి అక్రమాలకు చరమ గీతం పాడుతూ పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేని టెండర్ల విధానం తీసుకురావాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఈ అంశంపైనే శుక్రవారం సీఎస్‌తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. 

టెండర్ల విధానంలో సమూల మార్పులు 
ప్రస్తుతంఉన్న కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌కి(సీవోటీ) అధిపతిగా హైకోర్టును సంప్రదించి ఒక న్యాయమూర్తిని నియమించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సెంట్రల్‌ విజిలెన్స్‌ మార్గదర్శకాల ప్రకారం టెండర్లను ఆహ్వానించిన తరువాత కాంట్రాక్టర్లతో ఎలాంటి సంప్రదింపులు జరుపరాదు. అయితే, అందుకు విరుద్ధంగా గతంలో అస్మదీయుల కోసం సంప్రదింపులు జరపడం, కావాల్సిన వారి కోసం అంచనాలను మార్చడం వంటివి జరిగాయి. వీటన్నింటికీ చెక్‌ పెట్టేలా సంస్కరణలతో కూడిన టెండర్ల విధానం తీసుకురావాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఒకసారి టెండర్లు ఆహ్వానించిన తరువాత ఎల్‌–1గా ఎవరు వస్తే వారికే కాంట్రాక్టును ఖరారు చేయడం, నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చకపోవడం వంటి సంస్కరణలు జగన్‌ మదిలో ఉన్నట్లు చెబుతున్నారు. సీవోటీలో అడ్మినిస్ట్రేటర్‌ను కూడా నియమించి, టెండర్ల ప్రక్రియ నిబంధనల మేరకు సాగిందా లేదా అనేది న్యాయమూర్తికి వివరించేలా చూడాలని ముఖ్యమంత్రి ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. 

ఆర్థిక, రెవెన్యూ రంగాలపై నేడు సీఎం సమీక్ష 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా వాడేసుకున్న విషయం తెలిసిందే. పోలింగ్‌ పూర్తయిన తరువాత కూడా గత ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారికి బిల్లులు చెల్లింపులు జరిగాయి. తెలుగుదేశం పార్టీ పాలకుల నిర్వాకం వల్ల రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఎన్నికల ముందు గత ప్రభుత్వం హడావిడిగా చేపట్టిన పనులు, పెండింగ్‌ బిల్లులు, నిధుల ఆర్జన, శాఖల పనితీరు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. 

పని వేళల్లోనే విధులు నిర్వహిస్తే చాలు 
పరిపాలన వ్యవస్థలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చేందుకు కిందస్థాయి నుంచి పైస్థాయి దాకా సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచ బ్యాంకు సూచించిన ప్రొక్యూర్‌మెంట్‌ చట్టంలోని అంశాలను సైతం అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాంట్రాక్టర్లతో సంప్రదింపుల విధానానికి స్వస్తి పలికేలాగా టెండర్ల విధానం తీసుకురావాలని, న్యాయమూర్తి సమక్షంలో టెండర్లను ఖరారు చేసిన తరువాత ఎవరైనా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేయాలని నిర్ణయానికొచ్చారు. వీటికి త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఒక రూపం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఉద్యోగులు పని వేళల్లోనే కార్యాలయాల్లో విధులు నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అధికారులు, ఉద్యోగులు పని చేస్తే సరిపోతుందని, సెలవు రోజుల్లో విధులు నిర్వహించాల్సిన అవసరం లేదని సీఎం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేశారు. సాయంత్రం 6 గంటల తరువాత అధికార కార్యక్రమాలు ఉండవని కూడా అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

>
మరిన్ని వార్తలు