హైకోర్టులో కరోనా కట్టడికి కఠిన మార్గదర్శకాలు

21 Jun, 2020 04:24 IST|Sakshi

అధికారులు, సిబ్బంది అనుమతి లేకుండా 

హెడ్‌క్వార్టర్స్‌ విడిచి వెళ్లకూడదు 

కరోనా లక్షణాలను దాచిపెడితే క్రమశిక్షణ చర్యలు

సాక్షి, అమరావతి: హైకోర్టు కరోనా కట్టడికి తమ ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, సందర్శకుల విషయంలో కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ ఈ మార్గదర్శకాలు జారీ చేశారు. 

►హైకోర్టు అధికారులు, సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లకూడదు. ఒకవేళ అనుమతి లేకుండా వెళితే దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. 
►ఎవరైనా అనుమతి తీసుకుని రాష్ట్రం దాటితే, తిరిగి విధుల్లోకి వచ్చే ముందు విధిగా క్వారంటైన్‌లోకి వెళ్లితీరాలి. 
►హైకోర్టు ప్రవేశ ద్వారం వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు తప్పనిసరి. అనంతరం మాస్కులు ధరించినవారినే లోపలికి అనుమతిస్తారు. 
►జ్వరం, కోవిడ్‌ లక్షణాలున్న వారిని కోర్టు ప్రాంగణంలోకి అనుమతించరు.  
►అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు భౌతిక దూరాన్ని పాటించాలి. కోవిడ్‌ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉంటే, వెంటనే వివరాలను సంబంధిత కంట్రోలింగ్‌ అధికారికి తెలియచేయాలి.  
►అన్ని వేళల్లో కారిడార్లలో, కార్యాలయాల్లో సమూహాలుగా ఉండటం నిషిద్ధం. అధికారిక పని ఉంటే మినహాయింపు. 
►ప్రతి కంట్రోలింగ్‌ అధికారి తమ సెక్షన్ల వద్ద శానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌లు అందుబాటులో ఉంచాలి. 
►కంటైన్‌మెంట్‌ జోన్‌ల్లో నివాసం ఉంటున్న అధికారులు, సిబ్బంది తమ వివరాలను కంట్రోలింగ్‌ అధికారులకు తెలియచేయాలి. 
►మొత్తం హైకోర్టు ప్రాంగణాన్ని తరచూ శానిటైజ్‌ చేస్తూ ఉండాలి.

మరిన్ని వార్తలు