కట్టుదిట్టంగా కౌంటింగ్‌

18 May, 2019 10:49 IST|Sakshi
స్ట్రాంగ్‌ రూము డోర్‌ వద్ద నుంచి కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన టేబుళ్లు

కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలు ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ జారీ చేసింది. అవాంఛనీయ సంఘటనలు, కౌంటింగ్‌కు అంతరాయం చోటు చేసుకోకుండా మూడంచెల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.  కౌంటింగ్‌ హాలుకు వంద మీటర్ల చుట్టూ డీ మార్కింగ్‌ చేస్తారు. దీన్ని పెడెస్ట్రియన్‌ జోన్‌ అంటారు. కౌంటింగ్‌ హాలుకు వంద మీటర్ల ఆవలనే వాహనాలను ఆపివేస్తారు. ఈ పెడెస్ట్రియన్‌ జోన్‌ చుట్టూ బ్యారికేడ్లు నిర్మిస్తారు. ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది. ఇక్కడ స్థానిక పోలీసులను నియమిస్తారు.కౌంటింగ్‌ ఆవరణలోకి వెళ్లే వారి గుర్తింపు పత్రాలను పోలీసులు పరిశీలిస్తారు. అధికారిక అనుమతి పత్రం, ఫొటో గుర్తింపు కార్డు లేకపోతే అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్లు తదితరులను ఎవరినీ అనుమతించరు. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన మీడియా పాస్‌ ఉంటేనే పాత్రికేయులకైనా అనుమతి ఉంటుంది. మెజిస్టీరియల్‌ అధికారాలు కలిగిన సీనియర్‌ రెవెన్యూ అధికారి ఎంట్రీ పాయింట్‌ వద్ద ఉంటారు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి కౌంటింగ్‌ హాలు దూరంగా ఉన్నప్పుడు ఈవీఎంలు తీసుకెళ్లడానికి అసౌకర్యంగా ఉంటుంది.  కౌంటింగ్‌ హాలు వరకు ప్రత్యేకంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తారు. బిల్డింగ్‌ ప్రవేశ ద్వారం నుంచి కౌంటింగ్‌ హాళ్ల వరకు ఉన్న ప్రదేశాన్ని రెండవ అంచెగా పరిగణిస్తారు. తగినంత మంది రాష్ట్ర ఆర్మ్‌డ్‌ పోలీసులు ఇక్కడ ఉంటారు.

∙ఆడియో, వీడియో రికార్డు చేయగల మొబైల్‌ ఫోన్లు, ఐప్యాడ్లు, ల్యాప్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను లోనికి అనుమతించరు. అగ్గిపెట్టె, ఇంకుపెన్నులు, బ్లేడ్లు, చాకులు, పిన్నులు, ఆయుధాలను కౌంటింగ్‌ హాలులోకి తీసుకువెళ్లేందుకు అనుమతించరు. పెన్సిల్, వైట్‌ పేపర్స్‌ తీసుకువెళ్లవచ్చు. 
∙రాష్ట్ర పోలీసులు మాత్రమే ఇక్కడ తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. మహిళలను కేవలం మహిళా పోలీసులు లేదా మహిళా హోం గార్డులు మాత్రమే తనిఖీ చేయాలి.
∙కౌంటింగ్‌ హాలు బయట నిలబడి ఎవరూ ఫోన్లలో మాట్లాడటం వంటివి చేయకూడదు. మీడియా లేదా పబ్లిక్‌ కమ్యూనికేషన్‌ రూములో మాత్రమే ఫోన్లలో మాట్లాడుకోవచ్చు. ఫోన్లు డిపాజిట్‌ చేసే సౌకర్యం ఉంటుంది. డిపాజిట్‌ చేసినప్పుడు టోకెన్లు జారీ చేస్తారు.
∙కౌంటింగ్‌ కేంద్రంలోకి కంట్రోల్‌ యూనిట్లు తీసుకెళ్లే సిబ్బంది కదలికలు రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ వద్ద నున్న టీవీలో కనిపించే విధంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఉంటుంది.
∙కౌంటింగ్‌ కేంద్రం ద్వారం నుంచి మూడు అంచెల భద్రత ప్రారంభమవుతుంది. ఇక్కడ సీఏపీఎఫ్‌ సిబ్బంది ఉంటారు. రిటర్నింగ్‌ అధికారి పిలిస్తే తప్ప వీరు కౌంటింగ్‌ హాలులోకి ప్రవేశించరాదు. 
∙కౌంటింగ్‌ హాలులోకి నిషేధిత వస్తువులు తీసుకువెళ్లకుండా ఇక్కడ కూడా తనిఖీలు ఉంటాయి. కౌంటింగ్‌ హాలులో ఫొటోలు, వీడియోలు తీసేందుకు మీడియాకు అనుమతి ఉండదు. 
∙కౌంటింగ్‌ హాలులోకి ఫోన్లు తీసుకెళ్లడానికి కేవలం ఈసీఐ అబ్జర్వర్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. కౌంటింగ్‌ ఏజెంట్లు, సిబ్బంది లోనికి వెళ్లేందుకు ప్రత్యేక ప్రవేశ ద్వారం ఏర్పాటు చేస్తారు.


వీరికే లోనికి అనుమతి
కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, ఈసీఐ అనుమతి ఉన్న వ్యక్తులు, అబ్జర్వర్లు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్‌ ఏజెంట్లనులోనికి అనుమతిస్తారు. అభ్యర్థులైతేనే మంత్రులకు కౌంటింగ్‌ హాలులోకి ప్రవేశం ఉంటుంది. మంత్రులు ఎన్నికల ఏజెంట్లుగా, కౌంటింగ్‌ ఏజెంట్లుగా ఉండేందుకు అనుమతించరు. ఒక నియోజకవర్గానికి రెండు కంటే ఎక్కువ కౌంటింగ్‌ కేంద్రాలను వినియోగించాల్సి వస్తే ఆ విషయాన్ని అభ్యర్థులకు తెలపాలి. అలాగే ఏ కౌంటింగ్‌ హాలుకు ఏ పోలింగ్‌ కేంద్రాలను కేటాయించిందీ ముందుగానే వివరించాలి. కౌంటింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఎవరైనా ఏజెంట్‌ అనుచితంగా ప్రవర్తించినా, నిబంధనలు పాటించకపోయినా బయటికి పంపి వేసే అధికారం రిటర్నింగ్‌ అధికారికి ఉంటుంది. ఏజెంట్లు తమకు కేటాయించిన టేబుల్‌ వద్ద మాత్రమే కూర్చోవాలి. కౌంటింగ్‌ హాలు అంతా తిరిగేందుకు వారికి అనుమతి ఉండదు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు