24న సమ్మె నోటీసు: ఎన్‌ఎంయూ

18 Dec, 2013 01:32 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసు క్రమబద్ధీకరణపై ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు వెలువరించని పక్షంలో సమ్మె చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్‌ఎంయూ నిర్ణయించింది. ఈ మేరకు 24న యాజమాన్యానికి నోటీసు అందజేయాలని యూనియన్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వర్‌రావు, మహమూద్ మంగళవారంప్రకటించారు. ఆర్టీసీలో దాదాపు 24 వేల మంది కార్మికుల సర్వీసును క్రమబద్ధీకరించాలని చాలా కాలంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
 
  ఇటీవల సీమాంధ్ర ఉద్యమ సమయంలో సమ్మె విరమణకోసం జరిపిన చర్చల్లో రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ క్రమబద్ధీకరణపై సానుకూలంగా స్పందించారు. కానీ, ఇప్పటివరకు క్రమబద్ధీకరణపై అడుగు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 21లోపు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు వెలువడని పక్షంలో 24న సమ్మె నోటీసు ఇస్తామని ఎన్‌ఎంయూ ప్రకటించింది.

మరిన్ని వార్తలు