సమ్మె సక్సెస్

3 Sep, 2015 02:32 IST|Sakshi
సమ్మె సక్సెస్

పది కార్మిక సంఘాల పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు
జిల్లా వ్యాప్తంగా రాస్తారోకో, మానవహారాలు, ర్యాలీలు
తిరుపతిలో కార్మిక వ్యతిరేక భూతం దిష్టిబొమ్మ దహనం
 

చిత్తూరు:  కార్మిక చట్టాల్లో సవరణలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పది కార్మిక సంఘాలిచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం జిల్లాలో సమ్మె విజయవంతమైంది. సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌టీయూసీ మొదలుకుని   విద్యుత్, తపాలా, మెడికల్ అండ్ హెల్త్, ఎన్‌జీవో, ఉపాధ్యాయ సంఘా లు, అంగన్‌వాడీ, ఆశ,  నాల్గవ తరగతి ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, పంచాయతీరాజ్, భవన నిర్మాణ కార్మికులు, కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు పలు కార్మిక ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ఎదుట సంబంధిత కార్మిక వర్గాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనులు కొంతమేర స్తంభించాయి. తిరుపతి నగరంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, టీటీడీ, ట్రేడ్ యూనియన్‌ల వర్గాలు  భారీ ర్యాలీ నిర్వహించి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బహిరంగ సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను ఎండగట్టారు. కార్మిక చట్టాల్లో చేసిన సవరణలను తక్షణం ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను వెనక్కు తీసుకోకూడదని నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని నాయకులు కోరారు. అనంతరం కార్మిక వ్యతిరేక భూతం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చిత్తూరులో వామపక్ష పార్టీలు నగరంలో ర్యాలీ నిర్వహించాయి. పలమనేరు నియోజకవర్గంలో చెన్నై-బెంగళూరు ప్రధాన రహదారిపై అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలిపారు.

  చిత్తూరులో సీఐటీయూ, ఏఐటీయూసీ, వైఎస్సార్‌టీయూసీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, అంగన్‌వాడీ, గోపాలమిత్ర ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద నుంచి చర్చి వీధి, బజారువీధి ప్రధాన రహదారుల్లో ర్యాలీ కొనసాగింది.

 కలెక్టరేట్, డీఈవో, ఆర్డీవో, ఆర్టీసీ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన  కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోస్టాఫీసు ఎదుట పోస్టల్ ఉద్యోగులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ అధ్యక్షుడు చైతన్య, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నాగరాజన్, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
  పూతలపట్టులో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. బ్యాంకు సిబ్బం దితో పాటు మిగిలిన ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

చంద్రగిరిలో విద్యుత్ ఉద్యోగులు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కుప్పంలో ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ర్యాలీ నిర్వహించారు.  మదనపల్లెలో వామ పక్ష కార్మిక సం ఘాల నేతృత్వంలో ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం ఆర్టీసీ బస్టాండు ఎదుట సమావేశంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరి పై ధ్వజమెత్తారు. ఉద్యోగ, కార్మిక వర్గాలు సమావేశంలో పాల్గొన్నాయి.  పీలేరులో ఏఐటీయూసీ, సీఐటీ యూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ వర్క ర్లు, ఉపాధ్యాయులు, ఆటో వర్కర్లు తహశీల్దార్ కార్యాలయం నుంచి క్రాస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం ఏర్పాటు చేసి నిరసన తెలిపారు.  తంబళ్లపల్లెలో వామపక్ష కార్మిక సంఘాల నేతృత్వంలో ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు.సత్యవేడు సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక, ఉద్యోగ సంఘాలు తహశీల్దార్ కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మూడు రోడ్ల కూడలిలో నిరసన తెలిపారు.  శ్రీకాళహస్తిలో వామపక్షాల నేతృత్వంలో నిరసన ర్యాలీ చేపట్టారు.
 
 
 

మరిన్ని వార్తలు