రోడ్డెక్కిన కాంట్రాక్టు కార్మికులు

17 Dec, 2014 02:42 IST|Sakshi

విధులు బహిష్కరించి డిస్కం కార్యాలయం ఎదుట ఆందోళన
సమస్యలు పరిష్కరించుకుంటే  23 నుంచి ఆమరణ దీక్షలు
సమాన పనికి సమాన వేతనం  కావాలని డిమాండ్

 
సోమవారం అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించిన కాంట్రాక్టు విద్యుత్ కార్మికులు మంగళవారం డివిజన్ కార్యాలయాల ముందు రిలే నిరాహారదీక్షలకు దిగారు.  కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయకుంటే ఈ నెల 23 నుంచి ఆమరణ నిరాహారదీక్షలకు దిగుతామని హెచ్చరించారు.
 
తిరుపతిరూరల్ : జిల్లాలోని విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డెక్కారు. సోమవారం అర్ధరాత్రి నుంచి విధులను బహిష్కరించారు. మంగళవారం తిరుపతి, కలికిరి, చిత్తూరు డివిజన్ కార్యాలయాల ముందు రిలే నిరాహారదీక్షలకు దిగారు. ప్రభుత్వం అర్హులైన కాంట్రాక్టు కార్మికులను బేషరతుగా డిపార్టుమెంట్ కార్మికులుగా గుర్తించి సమానపనికి సమానవేతనం ఇవ్వాలని నినదించారు. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని దశలవారీగా కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. గ్లోబల్ టెండర్స్ విధానానికి స్వస్తి చెప్పి, మూడోపార్టీ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలన్నారు. ఈ సందర్భంగా తిరుపతి డిస్కం కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్ష శిబిరం వద్ద విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా కన్వీనర్ సుధాకర్ మాట్లాడుతూ పర్మినెంట్ ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచిన ప్రభుత్వం, క్షేత్రస్థాయిలో కష్టించే కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో మీనవేషాలు లెక్కించడం దారుణమన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయకుంటే ఈనెల 23 నుంచి ఆమరణ నిరాహారదీక్షలకు దిగనున్నట్టు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమేష్, కాత్యాయని, శివకుమార్, లత, ధర్మేంద్ర, ప్రతాప్, లోకేష్, కార్మికులు పాల్గొన్నారు.

అరకొర సిబ్బందితో అధికారుల వెతలు

జిల్లాలో దాదాపు 1500 మంది కాంట్రాక్టు కార్మికులు విధులను బహిష్కరించడంతో విద్యుత్‌శాఖలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ముఖ్యంగా 220, 132, 33 కేవీ సబ్ స్టేషన్ల వద్ద ఆపరేటర్స్, ప్యూజ్ ఆఫ్ కాల్ సిబ్బంది లేక అవస్థలు పడుతున్నారు. ఉన్న పర్మినెంట్ సిబ్బందితోనే సర్దుబాటు చేస్తున్నారు. పర్మినెంట్ సిబ్బందికి సెలవులు రద్దు చేసి విధుల్లోకి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి జిల్లాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని ట్రాన్స్‌కో ఎస్‌ఈ హరనాధరావు తెలిపారు.
 
 

మరిన్ని వార్తలు