ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు

12 Jul, 2014 00:09 IST|Sakshi
ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు

గుంటూరుసిటీ: జిల్లాలో నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. డీఆర్‌సీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ధరల నియంత్రణ సంఘం సమావేశం జరిగింది.
 
 సమావేశంలో సంయుక్త కలెక్టరు తరఫున పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి నాగబాబు మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో ఉన్న సరుకుల ధరల కన్నా తక్కువ ధరకే వినియోగదారులకు  సరుకులను అందించాలన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని రైతు బజార్లలో, గుంటూరు అరండల్‌పేటలోని ప్రభుత్వ ఎన్‌జీవో సంఘం స్టోర్సులో కిలో రూ.30 కే మంచి రకం బియ్యాన్ని విక్రయిస్తున్నట్టు చెప్పారు. అదే రీతిలో ఉల్లిపాయలు కూడా కిలో రూ.26కు రైతు బజార్లలో అందిస్తున్నట్టు తెలిపారు.
 
 నిత్యావసర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టాలని, బ్లాక్ మార్కెంటింగ్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఆయన ఆదేశించారు. జనరిక్ మందుల షాపులలో, ఇతర మందుల షాపుల్లో మందుల ధరల్లో ఉన్న వ్యత్యాసాలపై ఔషధ నియంత్రణ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ సంయుక్తంగా తనఖీ చేసి వ్యత్యాసాలకు గల కారణాలపై తగిన నివేదికలను జిల్లా పౌర సరఫరాల అధికారికి అందజేయాలని ఆదేశించారు. సభ్యులు జోగారావు, పరంధామయ్యలు మాట్లాడుతూ  నగరంలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా పౌర సరఫరాల అధికారి రవితేజా నాయక్ మాట్లాడుతూ నిత్యావసర సరుకులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. సమావేశంలో నిఘా విభాగపు డీఎస్పీ అనిల్ బాబు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పి.మల్లికార్జునరావు, ఉద్యాన, పశుసంవర్థక, వ్యవసాయ, తూనికలు, కొలతలు,పురపాలక తదితర శాఖల అధికారులు,రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు వి.భాస్కరరావు, వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు