కలెక్టర్ల సమావేశానికి భద్రత కట్టుదిట్టం

18 Jan, 2018 07:08 IST|Sakshi

400 మందితో బందోబస్తు

 పర్యవేక్షించిన డీఐజీ, కలెక్టర్, ఎస్పీలు 

గుంటూరు : విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని రేంజ్‌ డీఐజీ కేవీవీ గోపాలరావు చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురు, శుక్ర వారాల్లో జరిగే కలెక్టర్ల సమావేశానికి అన్ని రకాల ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా బుధవారం డీఐజీ గోపాలరావు, కలెక్టర్‌ కోన శశిధర్, అర్బన్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి భద్రతా చర్యలు, పార్కింగ్‌ స్థలాల కేటాయింపు, గన్‌మెన్లు, డ్రైవర్లకు ప్రత్యేక వసతి, తదితర అంశాలపై చర్చించారు. 

ఇంటెలిజెన్స్‌ వర్గాల సూచనల మేరకు ప్రత్యేక బలగాలను సమీప ప్రాంతాల్లో మోహరించారు. అనువణువూ బాంబ్‌ డిస్పోజల్, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలతో జల్లెడ పట్టారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా చెక్‌ పోష్టులు ఏర్పాటు చేసి రెండు రోజులుగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించేందుకు మొబైల్‌ బృందాలను నియమించారు. 

పటిష్ట బందోబస్తు ఏర్పాటు
కలెక్టర్‌లు మొట్టమొదటి సారిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసు యంత్రాంగాన్ని కేటాయించారు.  400 మంది అధికారులు, సిబ్బంది హాజరుకావడంతో ఎస్పీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి వారిని బృందాల వారీగా కేటాయించి ఆయా బృందాలకు ఇన్‌చార్జిలుగా డీఎస్పీలను కేటాయించారు. 

వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
ట్రాఫిక్‌ విధులు నిర్వహించే వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ట్రాఫిక్‌సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎస్పీ ఆదేశించారు. ముందుగానే ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌ పోష్టులతో అను సందానంగా పనిచేస్తూ ట్రాపిక్‌ను ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించాలని ఆదేశించారు.

కరకట్టపై రాకపోకలు నిషేధం
ప్రకాశంబ్యారేజీ (తాడేపల్లి రూరల్‌) : మంత్రులు, ఐపీఎస్, ఐఏఎస్,  రాష్ట్రంలోని ఉన్నతాధికారుల సమావేశం ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట సీఎం నివాసం వద్ద 18, 19 తేదీల్లో జరగనుండడంతో ఉండవల్లి–అమరావతి కరకట్టపై ప్రకాశంబ్యారేజి నుంచి అప్పారావు గెస్ట్‌హౌస్‌ వరకు రాకపోకలను నిషేధిస్తున్నట్లు నార్త్‌జోన్‌ డీఎస్పీ గోగినేని రామాంజనేయులు తెలిపారు.

 బుధవారం ప్రకాశంబ్యారేజి ఔట్‌పోస్ట్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన 250 మంది అధికారులతో పాటు అదనంగా మరో 250 మంది ఈ సమావేశానికి హాజరవుతున్నారు. వీరందరూ లోటస్‌ఫుడ్‌సిటీ నుండి సీఎం నివాసానికి వెళ్లేందుకు జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు.   రాజధానిలోని 29 గ్రామాల ప్రజలతో పాటు ఉండవల్లి, పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. 

సమావేశాలను జయప్రదం చేయండి
ఉండవల్లి (తాడేపల్లి రూరల్‌): ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట సీఎం నివాసం వద్ద ఉన్న గ్రీవెన్స్‌ బిల్డింగ్‌లో 18,19 తేదీల్లో మొట్టమొదటిసారిగా జరిగే  ఐపీఎస్, ఐఏఎస్, మంత్రివర్గ సమావేశాల జయప్రదానికి అందరూ కృషిచేయాలని కలెక్టర్‌ కోన శశిధర్‌ సూచించారు.  బుధవారం సీఎం నివాసం వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మిగతా శాఖ అధికారులు, మంత్రి వర్గ అనుచరులకు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారు కూడా సీఎం నివాసం వద్దే కూర్చునేందుకు షెల్టర్, భోజనం ఏర్పాటు చేయాలని ఆయన జిల్లా అధికారులకు సూచించారు. అర్బన్‌ ఎస్‌.పి. విజయరావు కనకదుర్గ వారధి దగ్గర నుంచి ప్రకాశంబ్యారేజీ మీద, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి, కరకట్ట ప్రాంతాలను  పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో మంగళగిరి నార్త్‌జోన్‌ డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, మంగళగిరి రూరల్, పట్టణ సీఐలు మధు, హరికృష్ణ, ఎస్సైలు ప్రతాప్‌కుమార్, వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు