కార్మికులకంటే కష్టపడుతున్నా..!

2 May, 2016 02:25 IST|Sakshi
కార్మికులకంటే కష్టపడుతున్నా..!

♦ రాష్ట్రం అభివృద్ధి చెందేవరకు కేంద్రం ఆదుకోవాలి
♦ పరిశ్రమల్లో తనిఖీలకు ఆన్‌లైన్ విధానం
♦ చంద్రన్న బీమా పథకం ప్రారంభించిన ముఖ్యమంత్రి
 
 సాక్షి, విజయవాడ: కార్మికుల కంటే తానే ఎక్కువ కష్టపడుతున్నానని, ఎండల్లో 18 గంటలు కష్టపడుతున్న మొదటి కార్మికుడిని తానేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం విజయవాడ ఎ కన్వెన్షన్ సెంట ర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘చంద్రన్న బీమా పథకాన్ని’ బాబు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నాలుగైదు గంటలు ఎక్కువ అందరూ కష్టపడాలని ఆదేశించారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకు రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విభజన చట్టంలో హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంలో తమ పార్టీ మంత్రులు ఉన్నారే తప్ప పదవులు ఆశించి కాదని తెలిపారు. రాష్ట్రంలో 15 కార్మిక చట్టాలు ఉన్నాయని, ఒకే రిజిస్ట్రేషన్ కింద ఈ చట్టాలకు సంబంధించిన అనుమతులన్నీ ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమల్లో తనిఖీలకు  ఆన్‌లైన్ విధానం అమలు చేస్తామని చెప్పారు.  వివిధ పరిశ్రమలు, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వారి పరిశ్రమలు వద్దనే ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. ప్రమాదం వల్ల మరణించినా, పూర్తి అంగవైకల్యం సంభవించినా రూ.5 లక్షల మేర బీమా సొమ్మును వారి కుటుంబ సభ్యులకు అందచేస్తామని చెప్పారు. పాక్షిక అంగవైక్యం కలిగితే రూ.3,62,500 వరకు అంగవైకల్యస్థాయిని బట్టి చెల్లిస్తామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి చంద్రన్న బీమా పథకం అమలులోకి వస్తుందని వివరించారు. అనంతరం పథకానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు.

మరిన్ని వార్తలు