కొవ్వూరులో విషాద ఛాయలు

5 Jan, 2016 05:16 IST|Sakshi
కొవ్వూరులో విషాద ఛాయలు

 సెలవు రోజు కావడంతో గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లి గల్లంతైన నందిగం జయదేవ్ (15), గాలింకి సూర్యసుమంత్ (15) మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. జయదేవ్ తండ్రి లక్ష్మీమాధవ్ రెండు నెలల క్రితం మరణించారు. జయదేవ్ ఆ ఇంటికి పెద్ద కుమారుడు. అతనికి తమ్ముడు ఉన్నాడు. భర్త పోరుున దుఃఖం నుంచి తేరుకోకుండానే కుమారుడు దూరం కావటంతో జయదేవ్ తల్లి హేమలత గుండెలవిసేలా రోదిస్తోంది.
 
  దేవరపల్లికి చెందిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ జి.శ్రీనివాసరావు కుమారుడు సూర్యసుమంత్ కొవ్వూరు ఎస్సీ బాలుర వసతి గృహంలో పనిచేస్తున్న పెదనాన్న సుముద్రగుప్తుడు ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. ఆయనకు  మగపిల్లలు లేకపోవడంతో సోదరుడి కుమారుడిని రెండేళ్ల నుంచి తన దగ్గరే ఉంచుకుని చదివిస్తున్నారు. సుమంత్ మరణంతో తండ్రి శ్రీనివాసరావు, పెదనాన్న సముద్రగుప్తుడు కన్నీరు మున్నీరవుతున్నారు.
 
 కొవ్వూరులో విషాద ఛాయలు
 కొవ్వూరు : గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదే హాలను సోమవారం వెలికితీశారు. ఆదివారం సాయంత్రం గల్లంతైన వీరికోసం అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారులు రాత్రి పొద్దుపోయే వరకు నదిలో ముమ్మరంగా గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో నదిలో ఆక్సిజన్ సహకారంతో గాలించే ప్రత్యేక ఈతగాడి సాయంతో సోమవారం ఉదయం నందిగం జయదేవ్(15), గాలింకి సూర్య సుమంత్(15)ల మృతదేహాలు బయటకి తీశారు. గోష్పాదక్షేత్రం స్నానఘట్టంలో నిత్యం వందలాది మందిస్నానాలు ఆచరిస్తుంటారు.
 
  ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ దుర్ఘటన అందర్నీ కలచివేసింది. ఇద్దరు చిన్నారులు నదిలో మునిగిన గల్లంతవడంతో వారి బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో గోష్పాదక్షేత్రానికి చేరుకున్నారు. మొదటి సుమంత్ మృతదేహం లభ్యం అయింది. ఉదయం 11 గంటల సమయంలో జయదేవ్ మృతదేహాన్ని వెలికితీశారు. మృతులిద్దరూ కొవ్వూరు పట్టణంలో 21వ వార్డులోని వేగివారి వీధికి చెందినవారే కావడంతో ఆ వీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 
  సుమంత్ స్వగ్రామం దేవరపల్లి. రెండేళ్ల నుంచి కొవ్వూరు 21వార్డులో ఉంటున్న పెద్దనాన్న సముద్ర గుప్తుడు వద్ద ఉండి చదువు కుంటున్నాడు. జయదేవ్‌కి కొవ్వూరు పట్టణానికి చెందినవాడే. ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పర్యవేక్షించారు. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణ ఎస్సై ఎస్.పవన్‌కుమార్ కేసు నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు