నారాయణ నిర్లక్ష్యానికి మరో విద్యార్థి మృతి !

5 Oct, 2016 03:10 IST|Sakshi
నారాయణ నిర్లక్ష్యానికి మరో విద్యార్థి మృతి !
* చనిపోయిన 10 గంటల తరువాత విషయం చెప్పారు
న్యాయం అడిగితే పోలీసులతో అడ్డుకున్నారు
అనుమతులు లేకుండా నాలుగేళ్లుగా పాఠశాల నిర్వహణ
న్యాయం చేయాలంటూ హాస్టల్‌ ఎదుట మృతుని బంధువుల ధర్నా
 
గుంటూరు రూరల్‌: ‘మా కొడుకు చనిపోయాడని చెప్పకుండా కనిపించడం లేదని చెప్పారు. మరో రెండు గంటల తరువాత చనిపోయాడని చెప్పారు. కేవలం నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మా కొడుకు చనిపోయాడు’ అని అమరనాథ్‌ తండ్రి, బంధువులు ఆరోపించారు. గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన కంచుపాటి శ్రీనివాసరావు, తిరుపతమ్మలకు లేక లేక కలిగిన కుమారుడు అమరనాథ్‌(14) నారాయణ పాఠశాలలో పొత్తూరు క్యాంపస్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. శ్రీనివాసరావు తమ్ముడు రామకోటయ్యకు సైతం పిల్లలు లేకపోవడంతో రెండు కుటుంబాలకు ఒక్కగానొక్క కొడుకు ఇతడే.

అందుకే మంచి స్కూల్లో వేసి బాగా చదివించుకోవాలని పొత్తూరు గ్రామ పంచాయితీ పరిధిలో ఒక అపార్ట్‌మెంట్‌లో నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థల పాఠశాలలో చేర్చారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఘటన జరిగిన తరువాత సైతం పాఠశాల యాజమాన్యం సాయంత్రం 6 గంటల సమయలలో అమరనాథ్‌ పాఠశాల ఫీజు చెల్లించాలని బకాయి ఉందని తనకు ఫోన్‌ చేశారని మృతుని తండ్రి తెలిపారు. అప్పుడే చెప్పినా తన కొడుకును చూసుకునే వాడినని, అర్థరాత్రి వరకూ దిక్కు లేకుండా పొలాల్లో అనాథ శవంలా వదిలేశారని భోరున విలపించాడు. ఫీజుకోసం ఫోన్‌ చేసిన అనంతరం మరో గంటకు మీ కొడుకు కనిపించడం లేదని చెప్పారని, మరో రెండు గంటల తర్వాత గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్నాడని పాఠశాల ప్రిన్సిపాల్‌ తెలిపారన్నారు. తమ కుమారుడి మృతికి కారణాలు చెప్పాలని సోమవారం ఉదయం 5 గంటల నుంచి పాఠశాల ఎదుట బైఠాయించినా  సమాధానం లేదని ఆరోపించారు.

తమకు న్యాయం చేయాలంటూ పాఠశాలలోకి చొచ్చుకుని వెళ్లి కార్యాలయం తలుపు అద్దాలను పగుల గొట్టారు. దీంతో స్పందించిన యాజమాన్యం దిగి వచ్చి, తమకు సంబంధం లేదని అమరనాథ్‌ తన స్నేహితులు ముగ్గురితో కలిసి వెళ్లి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పడిపోయాడని తెలిపారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో జన సంచారం లేకుండా, కనీసం సదుపాయాలు లేని చోట పాఠశాలను ఏ విధంగా నిర్వహిస్తున్నారని ప్రశ్నించగా యాజమాన్యం జవాబు ఇవ్వలేదు. దీంతో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
 
అనుమతులు లేవు, దరఖాస్తు చేశారు...
నాలుగేళ్లుగా అనుమతులు లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్నా ఒక్క అధికారి కూడా అటువైపు రాకపోవడం గమనార్హం. ఏడాది ప్రారంభంలో అనుమతులు లేని పాఠశాలలను సీజ్‌ చేసిన అధికారులు నారాయణ పాఠశాలకు అనుమతులు లేకున్నా ఎందుకు వదిలేశారనేది బహిరంగ రహస్యమే. అధికార పార్టీ అండతో అక్రమంగా పాఠశాలను నిర్వహిస్తున్నా పట్టించుకోకుండా తమ కుమారుడి మృతికి కారణమయ్యారని విద్యార్థి బంధువులు ఆరోపించారు.
 
దసరా సెలవులకు వస్తానన్నాడు...
తాను శనివారం మధ్యాహ్నం ఫోన్‌లో మాట్లాడానని, దసరా సెలవులు మరో రెండు రోజుల్లో ఇస్తారని, అప్పుడు ఇంటికి వస్తానని చెప్పాడని అమరనాథ్‌ బాబాయి రామకోటి వాపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకును నారాయణ యాజమాన్యం పొట్టన పెట్టుకుందని రామకోటి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరో విద్యార్థి కుటుంబానికి ఇలా జరుగకుండా అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని రామకోటి కోరారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని మృతుని కుటుంబసభ్యులకు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.
>
మరిన్ని వార్తలు