ప్రతి విద్యార్థీ ఆదర్శం కావాలి

7 Jul, 2018 12:25 IST|Sakshi

విజయనగరం టౌన్‌: జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన ‘స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌’ ఆహూతులను ఆకట్టుకుంది.  కార్యక్రమానికి కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన పది ప్రభుత్వ పాఠశాలలకు  రూ.11 లక్షల విలువైన ఎల్‌ఈడీ ప్రొజెక్టర్లు, స్క్రీన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, వైట్‌ బోర్డులు, ఆడియో స్పీకర్లు, ట్రాఫిక్‌ ఎడ్యుకేషన్‌ కిట్లను అందజేశారు.

అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావం, మాతృదేశం పట్ల దేశభక్తి, మానవత్వ విలువలు కలిగి ఉండాలన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, కలాం వంటి ఎంతోమంది మహనీయులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసించి అత్యున్నత స్థానాలు అధిరోహించారని చెప్పారు. అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని, ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు

ఎస్పీ జి.పాలరాజు ఆధ్వర్యంలో  పోలీస్‌ శాఖ విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తోందన్నారు. తాను, ఎస్పీ వేదికపైన ఉన్న మిగిలిన అధికారులందరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. విద్యపట్ల అవగాహన, విద్యార్థులకు లక్ష్యాన్ని నిర్దేశించేందుకు గానూ ఇటీవల తాను ‘ కలెక్టరుతో కాసేపు’ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులతో మమేకమయ్యామని తెలిపారు.

ఎస్పీ జి.పాలరాజు మాట్లాడుతూ,  ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ పాఠశాలలకు ఏ విధంగా తీసిపోవని, ఈ విషయాన్ని నిరూపించాలనే  43 ప్రభుత్వ పాఠశాలలను దత్తతగా స్వీకరించామన్నారు.విద్యార్థి దశ నుంచే వారికి అనేక విషయాల పట్ల అవగాహన కలిగించి బాధ్యత కలిగిన పౌరునిగా తీర్చిదిద్దేందుకుప్రయత్నిస్తున్నామన్నారు.

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘ స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్‌’ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పది ప్రభుత్వ పాఠశాలలకు రూ.11 లక్షల విలువైన వస్తువులను అందజేస్తున్నామన్నారు. 

పది రోజుల శిక్షణ

కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో ఏపీ మోడల్‌ స్కూల్, జొన్నవలస, గంట్యాడ. జర్జాపేట, బొండపల్లి, గరివిడి, చీపురుపల్లిలో గల జెడ్పీ హైస్కూళ్లు, పార్వతీపురంలో గల ప్రభుత్వ హైస్కూల్,  సాలూరు ప్రభుత్వ బాలికల హైస్కూల్, వేటగానివలస ప్రభుత్వ  ట్రైబల్‌ వెల్పేర్‌ హైస్కూల్‌కి చెందిన 8, 9 తరగతులకు చెందిన 200 మంది విద్యార్థులను ఎంపిక చేసి పది రోజుల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఓఎస్‌డీ విక్రాంత్‌ పాటిల్, పీటీసీ ప్రిన్సిపాల్‌ రాజాశిఖామణి, డీఈఓ నాగమణి, ఏఆర్‌ డీఎస్పీ హనుమంతు, మహిళా పీఎస్‌ డీఎస్పీ కుమారస్వామి, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐలు వైవీ.శేషు, జి.రామకృష్ణ, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీహరిరావు, గురునాథరావు, రామకృష్ణ, శంకరరావు, రమేష్, వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, పలువురు ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు