ఎల్‌బ్రస్‌నైనా ఎక్కేస్తా! 

12 Jul, 2019 08:15 IST|Sakshi
కిలిమంజారో పర్వతంపై జాతీయ పతాకంతో రమేష్‌

కిలిమంజారోను అధిరోహించిన తిమ్మాపురం యువకుడు  

ఎల్‌బ్రస్‌ పర్వత పయనానికి సహకరించాలని దాతలకు విజ్ఞప్తి

కర్నూలు (గాయత్రీ ఎస్టేట్‌): ఇప్పటికే ఆఫ్రికా ఖండం టాంజానియాలోని కిలిమంజారో పర్వతంపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన రాయలసీమ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి చిక్కెం రమేష్‌.. దాతలు సహకరిస్తే మరో సాహస యాత్రకు సై అంటున్నాడు. మంత్రాలయం మండలం వి. తిమ్మాపురానికి చెందిన ఆనందప్ప, ఆశీర్వాదమ్మ దంపతుల కుమారుడు రమేష్‌ ఆర్‌యూలో ఎంఏ ఎకనామిక్స్‌ పూర్తి చేశాడు. గత ఏడాది 40 మంది యువకులతో కలిసి సాహసయాత్ర చేపట్టిన రమేష్‌ కిలిమంజారోపై మువన్నెల జెండా,రాయలసీమ యూనివర్సిటీ పతాకాన్ని రెపరెపలాడించి  ప్రశంసలు అందుకున్నాడు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో కూలీపనులు చేసుకుంటూ పిల్లలను చదివించారు. అయితే చిన్నప్పటి నుంచి పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్న రమేష్‌ .. కల సాకారం చేసుకునే దశలో ముందడుగు వేశాడు. పర్వతారోహణ కోసం యువజన సంక్షేమ శాఖ వారు గత ఏడాది ఫిబ్రవరి 12న జిల్లా స్థాయి, 24న రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించగా ఏపీలో 150 మంది హాజరయ్యారు. ఇందులో 60 మందిని ఎంపిక చేసి కృష్ణా జిల్లా కేతనకొండ సీబీఆర్‌ అకాడమీలో ఐదు రోజులు, మార్చి 1 నుంచి జమ్మూ కశ్మీర్‌ పహల్‌గావ్‌లో 25 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. అనంతరం కిలిమంజారో పర్వతారోహణకు ఎంపికైన 40 మందిలో రమేష్‌ కూడా ఉన్నాడు. గత ఏడాది సెప్టెంబర్‌ 8వ తేదీ ఉదయం 9 గంటలకు కిలిమంజారో పర్వతారోహణ యాత్ర ప్రారంభించి 13వ తేదీ ఉదయం 8:20 గంటలకు 5,895 మీటర్ల (19,341అడుగులు) పర్వతాన్ని అధిరోహించారు. పర్వతంపై జాతీయ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఇదే స్ఫూర్తితో వచ్చే నెల 10వ తేదీ యూరఫ్‌ ఖండంలో అతి ఎత్తయిన ఎల్‌బ్రస్‌ (రష్యా) పర్వతాన్ని అధిరోహించేందుకు శిక్షణ పొందాడు. మౌంట్‌ ఎల్‌బ్రస్‌ ఎక్స్‌పెండేషన్‌ మిషన్‌ –2019 హైదరాబాద్‌ ఇందుకోసం అవకాశం కల్పించారు. అయితే పర్వతారోహణకు అయ్యే ఖర్చు భరించే స్థితిలో లేని రమేష్‌ దాతలు సహకారం కోసం ఎదురుచూస్తున్నాడు. సాయం చేస్తే ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని కూడా అధిరోహించి జిల్లా, యూనివర్సిటీకి కీర్తి ప్రతిష్టలు తెస్తామని చెబుతున్నాడు.  

మరిన్ని వార్తలు