హృదయవిదారకం

14 Oct, 2017 10:03 IST|Sakshi
మంచానికే అంకితమైన గంట సాయికుమార్‌ ,ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయికుమార్‌(ఫైల్‌)

గుండె సంబంధిత వ్యాధితో మంచం పట్టిన విద్యార్థి

కొట్టుకోవడంలో లెక్కతప్పిన  హృదయం

ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీపై ఆంక్షలతో ఆగిన వైద్యం

అప్పులపాలైన తల్లిదండ్రులు

దాతల సాయం కోసం ఎదురుచూపు

శ్రీకాకుళం , ఎల్‌.ఎన్‌.పేట: తెల్లవారితే ఆ భార్యాభర్తలిద్దరూ కూలీ పనులకు వెళ్లిపోతారు. ఆస్తి పాస్తులు లేకపోయిన ఉన్న ఇద్దరు కుమారుల్ని బాగా చదివించుకుందామని నిర్ణయించుకున్నారు. మేము చదువుకోకపోయినా పిల్లల్ని చదివిస్తే వారి జీవితం బాగుంటుందని ఆశపడ్డారు. వారు ఉన్నతులుగా ఎదిగి హాయిగా జీవించాలని ఎన్నో కళలు కన్నారు. మేం ఇద్దరం.. మాకు ఇద్దరు.. అన్నట్టు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. వారి సంతోషంపై విధికి కన్ను కుట్టింది. గత మూడు నెలలుగా వారికి కఠిన పరీక్ష పెట్టి మానసిక క్షోభను మిగుల్చుతుంది. వారి ఇద్దరు కొడుకుల్లో చిన్న అబ్బాయి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్నో ఆస్పత్రుల మెట్లెక్కి దిగినా వ్యాధి తగ్గలేదు. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ ఆదుకోలేదు. అంతంత మాత్రంగా ఉన్న డబ్బులు ఖర్చయిపోగా అప్పుల్లో మునిగిపోతున్న ఆ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. ఈ హృదయవిదారక సంఘటనకు సంబంధించి

వివరాలు ఇలావున్నాయి.
మండలంలోని ధనుకువాడ గ్రామానికి చెందిన గంట వరహాలరావు, అనసూయకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. చదువులో ఇద్దరు ముందంజలో ఉన్నారు. పెద్ద కొడుకు గంట ఢిల్లీశ్వరరావు లక్ష్మీనర్సుపేట ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, చిన్న కుమారుడు గంట సాయికుమార్‌ లక్ష్మీనర్సుపేటలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.

మూడు నెలల క్రితం నుంచి గుండె ప్రాంతంలో కొద్దికొద్దిగా నొప్పిగా, ఆయాసంగా ఉంటుందని సాయికుమార్‌ చెప్పడంతో స్థానికంగా, శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న డాక్టర్లను తల్లిదండ్రులు సంప్రదించారు. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడటంతో నొప్పి తగ్గేదని తల్లిదండ్రులు చెప్పారు. 15 రోజుల కిందట గుండె నొప్పిగా ఉందని వాంతులు చేయడంతో పాటు ఊపిరి ఆడడం లేదని బాధపడుతుండటంతో 108లో శ్రీకాకుళం రిమ్స్‌కి, అక్కడ నుంచి కిమ్స్‌కి తరలించామని తండ్రి వరహాలరావు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని ‘మైక్యూర్‌’ ఆస్పత్రికి తరలించామన్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ కోసం ప్రయత్నించగా రూ. 2 లక్షలే వర్తించిందన్నారు. ఆరోగ్యశ్రీ ఉన్నన్ని రోజులు ఆస్పత్రిలో ఉంచి తర్వాత డిస్సార్జ్‌ ఇచ్చి పంపించారని చెప్పారు. పూర్తి స్థాయిలో వైద్యం అందివ్వాలంటే రూ. 6 లక్షలు ఖర్చవుతుందని మైక్యూర్‌ ఆస్పత్రి డాక్టర్లు చెప్పినట్టు తల్లిదండ్రులు వాపోయారు.

40 సార్లే కొట్టుకుంటున్న గుండె
సాధారణంగా మానవుని గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అయితే ఈ అబ్బాయికి వచ్చే వ్యాధి కారణంగా గుండె 30 నుంచి 40 కంటే తక్కువసార్లే కొట్టుకుంటుందని డాక్టర్లు తనిఖీల్లో గుర్తించారని వరహాలరావు అన్నాడు. కొన్ని సందర్భాల్లో 20 సార్లు కొట్టుకోవడంతో నొప్పి, ఆయాసం, వాంతులు వస్తున్నాయని ఆవేదన చెందాడు. గుండె మార్పిడితో వ్యాధి పూర్తిగా నయమవుతుందని వైద్యులు అన్నారన్నారు. అలా కాకపోతే ప్రత్యేక యంత్రం ద్వారా గుండె కొట్టుకునే సామర్థ్యాన్ని పెంచవచ్చని చెప్పారన్నాడు. ఈ ప్రత్యేక యంత్రం కోసం రూ. 6 లక్షలు అవసరం ఉంటుందన్నారని తెలిపాడు. కళ్లముందే చదువుకుని అందరితో మంచి విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్న సాయికుమార్‌కు ఇలాంటి వ్యాధి సోకడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. దాతలు సాయం చేయాలని ఎదురు చూస్తున్నారు. సాయం చేయదలచినవారు సెల్‌: 8897865842 నంబర్‌కు సంప్రదించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు