ఒత్తిడి వల్లే విద్యార్థి ఆత్మహత్యాయత్నం

28 Nov, 2014 03:31 IST|Sakshi

విజయనగరం అర్బన్: పట్టణంలోని ఓ  కార్పొరేట్ కళాశాల విద్యార్థి బుధవారం చేసిన ఆత్మహత్యాయత్నం కళాశాల యాజమాన్యం, విద్యార్థుల మధ్య గొడవకు దారితీసింది.  సంఘటన జరిగిన 12 గంటల వరకు ఇటు పోలీసులకుగాని సంబంధిత ఇంటర్ పర్యవేక్షణాధికారికిగాని కళాశాల యాజమాన్యం తెలపకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. దీంతో విద్యార్థుల సంఘం గురువారం కళాశాలకు చేరుకుని నిరసన చేపట్టారు. కళాశాల ప్రాంగణంలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకుంటే యాజమాన్యం కనీసం స్పందించక పోవడం దారుణమంటూ  విద్యార్థులు నినాదాలు చేశారు. కళాశాల బోధనా తరగతుల నుంచి విద్యార్థులను సేకరించి కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు.

యాజమాన్య సిబ్బంది, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య రభస జరిగింది. పోలీసుల చొరవతో యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల విద్యార్థులు వెనక్కి తగ్గారు.  ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ బోధనాతరగతుల విరామ సమయంలో ఈ సంఘటన జరిగిందని, విద్యార్థికి అవసరమైన వైద్యచికిత్సను కళాశాల యాజమాన్యం చేయిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం ఒత్తిడి చదువుల వల్లే జూనియర్ ఇంటర్ విద్యార్థి శ్రీనివాస్ ఆత్మహత్యా యత్నం చేశాడని చెప్పారు.  కొద్దిరోజులుగా మార్కుల విషయం లో విద్యార్థి తల్లిదండ్రులు కూడా మందలించడం వల్ల మానసికంగా కుంగిపోయాడన్నారు.
 
విచారణ చేపట్టిన ఇంటర్ ఆర్‌ఐఓ బాబాజీ
కార్పొరేట్ కళాశాల ప్రాంగణంలో జరిగిన విద్యార్థి ఆత్మహత్యాయత్నం సంఘటనపై ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారి ఎల్‌ఆర్‌బాబాజీ గురువారం విచారణ చేపట్టారు. బాధిత విద్యార్థి మానసిక పరిస్థితి, ప్రవర్తనాతీరు, యాజమాన్య సిబ్బంది, అధ్యాపకుల ఒత్తిళ్లకు చెందిన పలు అంశాలపై తోటి విద్యార్థుల నుంచి లిఖిత పూర్వకంగా అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా బాబాజీ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి లిఖిత పూర్వకంగా సేకరించిన అభిప్రాయాల నివేదికను కలెక్టర్ ఎంఎంనాయక్, ఇంటర్మీడియెట్ పాలన ఉన్నతాధికారులకు పంపామని చెప్పారు. బాధిత విద్యార్థిపై ఒత్తిడి ఉన్నట్లు రుజువవుతోందన్నారు.
 
ఒత్తిడి చదువులపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆరా..!
విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్న కార్పొరేట్ కళాశాల నిర్వాకంపై చైల్డ్ వెలే ్ఫర్ కమిటీ శుక్రవారం ఆరా తీసింది. జిల్లా కమిటీ చైర్‌పర్సన్ కేసలి అప్పారావు కళాశాలకు వచ్చి సంఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి చదువులను ప్రేరేపించకూడదని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసనాయుడుకు సూచించా రు. సంఘటన వివరాలను లిఖితపూర్వకంగా యాజమాన్యం నుంచి తీసుకున్నారు.
 
కోలుకుంటున్నవిద్యార్థి
విజయనగరం క్రైం: పట్టణంలోతోటపాలెంలో ఓ  ప్రైవేటు ఇంటర్ మీడియట్‌కళాశాల మేడపైనుంచి దూకినవిద్యార్థి ఎం.శ్రీనివాస్ ప్రైవేటుఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. బాధితులనుంచి ఫిర్యాదురాకపోవడంతో కేసు నమోదు చేయలేదని సీఐ కె.రామారావు తెలిపారు.

మరిన్ని వార్తలు