కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలి

14 Sep, 2019 14:46 IST|Sakshi
ఎమ్మెల్యే శిల్పా రవికి వినతి పత్రం అందజేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు

సాక్షి, నంద్యాల : కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ విద్యార్థి, యువజన, జేఏసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే శిల్పారవి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘం నాయకులు, ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నా చేశారు. విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు రాజునాయుడు, చంద్రప్ప, శ్రీరాములు, రామచంద్రుడు, రవీంద్రనాయక్‌ మాట్లాడుతూ రాయలసీమ నుంచి రాష్ట్రప్రతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అయినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. శ్రీభాగ్‌ ఒప్పందం ప్రకారం 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలును రాజధాని చేయాల్సి ఉన్నా.. గత ప్రభుత్వం ఏకపక్షంగా కోస్తా ప్రాంతానికి తరలించి రాయలసీమకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు.

ధర్నా అనంతరం ఎమ్మెల్యే శిల్పారవిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం అనాలోచితంగా రాజధానిని ముంపు ప్రాంతంలో ఏర్పాటు చేసి, శాశ్వత భవనాలు నిర్మించకుండా రూ.కోట్లు తాత్కాలిక భవనాలకు వెచ్చించిందన్నారు. కర్నూలు రాజధానిని త్యాగం చేస్తే హైదరాబాద్‌ రాజధాని అయ్యిందని, మళ్లీ మనకు రాజధాని అవకాశం వచ్చినా గత ప్రభుత్వం ద్రోహం చేసిందని విమర్శించారు. రాజధాని, హైకోర్టు ఏర్పాటు అంశాలను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వారికి
 హామీనిచ్చారు. 

మరిన్ని వార్తలు