కన్నీటి పరీక్ష

24 Mar, 2017 18:15 IST|Sakshi
కన్నీటి పరీక్ష

పర్చూరు: చిన్నతనం నుంచి కష్టపడి చదివిస్తున్న తండ్రి పార్దివ దేహం ఓ వైపు.. ఏడాదంతా కష్టపడి.. ఇష్టపడి చదువుకున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మరో వైపు! చనిపోయిన తండ్రి తిరిగిరాడు.. పరీక్షకు వెళ్లకుంటే ఈ అకాశం మళ్లీరాదు. ఏం చేయాలి? అనే సంఘర్షణ ఆ విద్యార్థి మనసును కలచి వేసింది. తన భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్న విద్యార్థికి కాలం కన్నీటి పరీక్ష పెట్టింది. చివరికు తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలని బాగా పరీక్షలు రాసి ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని నిర్ణయం తీసుకున్నాడు ఆ విద్యార్థి. బాగా చదువుకో మంచి భవిష్యత్‌ ఉంటుంది అని చెప్పే తండ్రి లేడని తెలిసి కన్నీరు మున్నీరయ్యాడు.

దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు హాజరయ్యాడు. యద్దనపూడి మండలం గర్లమూడి గ్రామానికి చెందిన గుంజి వెంకటరావు (50) గుండెపోటు రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బుధవారం ఆపరేషన్‌ చేశారు. గురువారం వేకువజామున 2 గంటలకు మరణిం చాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు గుంజి సాయికుమార్‌ జాగర్లమూడి అడ్డగడ సుబ్బారావు హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు.  సంవత్సరం అంతా కష్టపడి చదివిని సాయికుమార్‌ ఇప్పటీకే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌  పరీక్షలు రాశాడు. గురువారం రాయాల్సిన గణితం పేపరు–1 పరీక్ష కోసం సాధన చేసుకుంటున్నాడు.

విజయవాడలో ప్రయివేటు ఆసుపత్రిలో సర్జరీ చేసిన అనంతరం తండ్రి వెంకటరావు మరణించాడనే విషయం తెలిసి, ఆ చిన్న హృదయంలో విషాదం నెలకొంది. నాన్న గుండె ఆగిందని.. తల్లడిల్లాడు.. తీరని శోకాన్ని... ఆగని వేదనని. పంటి బిగువున భరించి అసలైన కఠిన పరీక్షకు హాజరయ్యాడు. పేద కుటుంబానికి చెందిన సాయికుమార్‌ బాగా కష్టపడి చదువుతాడని తెలిపిన పాఠశాల ఉపాధ్యాయులు గురువారం అతడిని వెంటబెట్టుకుని పరీక్ష హాలుకు తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు