మంత్రి కోసం ఐదు గంటల నిరీక్షణ

18 Feb, 2019 09:17 IST|Sakshi
కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు

ఆకలితో అలమటించిన

విద్యార్థులు, తల్లిదండ్రులు

శ్రీకాకుళం: రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు రాక కోసం కింతలి పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ఐదు గంటలు ఆకలితో నిరీక్షించాల్సి వచ్చింది. విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు మంత్రి వస్తారని శనివారం పాఠశాల హెచ్‌ఎంకి సమాచారం అందింది. పాఠశాల ఆవరణలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కేబినెట్‌ సమావేశం ఉండడంతో శనివారం మంత్రి రావడం లేదని ఆ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో హెచ్‌ఎంకు అధికారులు సమాచారం అందించారు. ఆదివారం 10 గంటలకు మంత్రి వస్తారని చెప్పడంతో సైకిళ్లు తీసుకోవాల్సిన విద్యార్థినులతోపాటు అందరు విద్యార్థులు పాఠశాలకు రావాలని హెచ్‌ఎం తెలియజేశారు. వారితోపాటు తల్లిదండ్రులను కూడా రప్పించారు. ఉదయం 9 గంటల సరికే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. 10 గంటలకు రావాల్సిన మంత్రి మధ్యాహ్నం 2.15 గంటలకు రావడంతో అప్పటివరకు విద్యార్థులు,  తల్లిదండ్రులు ఆకలితోనే ఉండాల్సి వచ్చింది. కొందరు స్థానికంగా ఉన్న తమ ఇళ్లకు వెళ్లి భోజనం చేసి వస్తామని చెప్పినా ఉపాధ్యాయులు దీనికి నిరాకరించారు. మధ్యాహ్న భోజనం కోసం ఉంచిన గుడ్లును ఉడకబెట్టి అప్పటికప్పుడు విద్యార్థులకు పంపిణీ చేశారు. మంత్రి తీరిగ్గా 2.15 గంటలకు వచ్చి 3.15 గంటల వరకు సైకిళ్లు పంపిణీ చేసి ఉపన్యాసం చేశారు. అప్పటిదాకా ఆకలితో ఉండాల్సి వచ్చింది.

వేచి ఉన్న పత్రికా విలేకర్లు..
మంత్రి శ్రీకాకుళం నగరానికి వస్తున్నారని, అరసవల్లి జంక్షన్‌లో ఉన్న ఓ ప్రైవేటు అతిథి గృహంలో పత్రికా విలేకరుల సమావేశం ఉందని సమాచారం విలేకరులకు అందింది. 12 గంటలకు సమావేశమని చెప్పడంతో ఆ సమయానికి విలేకరులంతా అక్కడికి చేరుకున్నారు. మంత్రి గంటా మధ్యాహ్నం 2 గంటలకు నగరానికి రాగా విలేకరులతో మాట్లాడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విప్‌ రవికుమార్‌ వచ్చి మంత్రిని పక్కకు తీసుకెళ్లి ఏదో మాట్లాడారు. దీంతో మంత్రి కింతలిలో ఓ కార్యక్రమం ఉందని, అది పూర్తయిన తర్వాత వచ్చి విలేకర్లతో మాట్లాడతానన్నారు.  మంత్రి 3.30 గంటలకు నగరానికి చేరుకొని పత్రికా విలేకరుల సమావేశం జరగాల్సిన అతిథి గృహానికి వచ్చి నేరుగా భోజనానికి వెళ్లారు. తర్వాత విలేకరులతో మాట్లాడతారని అందరూ భావించగా భోజనం చేసిన వెంటనే విశాఖపట్నం వెళ్లిపోయారు. అధికారులు, పత్రికా ప్రతినిధులు నిర్ఘాంతపోయారు. 

>
మరిన్ని వార్తలు