ఐఐటీలో మెరుపులు

20 Jun, 2014 02:23 IST|Sakshi
ఐఐటీలో మెరుపులు

 ఐఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో జిల్లా విద్యార్థులు మెరిశారు. కర్నూలు నగరానికి చెందిన ఉదయ్ 11వ ర్యాంక్, మంత్రాలయానికి చెందిన రఘువీర్ 16వ ర్యాంకుసాధించారు. మరికొందరు విద్యార్థులు మెరుగైన ర్యాంకులతో సత్తాచాటారు.
 
కర్నూలు(విద్య) : ఐఐటీ విద్యాసంస్థల్లో జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో కర్నూలు జిల్లా విద్యార్థులు మెరిశారు. 11, 16 ర్యాంకులను సాధించి విజయకేతనం ఎగురవేశారు. కర్నూలు నగరంలోని ఆదిత్య టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకులు డాక్టర్ తిరుపాల్‌రెడ్డి, డాక్టర్ ఉమాదేవి కుమారుడైన ఉదయ్.. పాఠశాల విద్యను స్థానిక ఎ.క్యాంపులోని మాంటిస్సోరి పాఠశాలలో అభ్యసించాడు. పదో తరగతిలో 10కి 10 పాయింట్లు సాధించాడు.
 
ఆ తర్వాత హైదరాబాద్‌లోని నారాయణ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మీడియట్ ఎంపీసీ గ్రూపులో 982 మార్కులు, ఎంసెట్‌లో 64వ ర్యాంకు, జేఈఈ మెయిన్స్‌లో 330 మార్కులు సాధించాడు. గురువారం విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌లోనూ ఆ విద్యార్థి జాతీయ స్థాయిలో సత్తాచాటి ఓపెన్ కేటగిరిలో 11వ ర్యాంకు సాధించాడు. గత ఏడాది ఇతని సోదరుడు వెంకట ఆదిత్య సైతం 44వ ర్యాంకు సాధించి ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరాడు. ఇప్పుడు తమ్ముడు ఉదయ్ సైతం ముంబయి ఐఐటీలో చేరి కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరతానని చెప్పాడు.
 
తరగతి గదిలో చెప్పిన అంశాలను ఎప్పటికప్పుడు చదువుకోవడం, పాత ప్రశ్నపత్రాలు, కళాశాల యాజమాన్యం ఇచ్చిన మెటీరియల్‌ను అభ్యసించడం వల్లే ఈ ర్యాంకు సాధ్యమైందని ఉదయ్ చెప్పాడు. వాస్తవంగా తనకు 50లోపు ర్యాంకు వస్తుందని భావించానని, కానీ 11వ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాగా డాక్టర్ తిరుపాల్‌రెడ్డి, డాక్టర్ ఉమాదేవి మాట్లాడుతూ.. గత ఏడాది పెద్ద కుమారుడు, ఇప్పుడు చిన్నకుమారుడు ఐఐటీలో అత్యున్నత ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. మొదటి నుంచి ఇద్దరూ పట్టుదల, ప్రణాళికతో పాటు ర్యాంకు సాధించాలన్న కసితో చదివేవారని వారు పేర్కొన్నారు.
 
వెంకట విశ్వతేజకు 264వ ర్యాంకు

కర్నూలు నగరంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసిన కానాల వెంకటవిశ్వతేజకు జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ఎస్సీ 264వ ర్యాంకు(ఎస్సీ కేటగిరి) సాధించాడు. ఈయన తండ్రి ఎ. వెంకటేశ్వర్లు, తల్లి కె.ఎ. లక్ష్మి. వీరు వడ్డేగేరిలో నివాసముంటున్నారు. తండ్రి హెడ్‌పోస్టాఫీసులో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. రెండో కుమారుడు కె. వెంకట విశ్వతేజ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు సెయింట్ మెరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో, 8 నుంచి 10 వరకు లిటిల్‌బర్డ్స్ హైస్కూల్‌లో చదివాడు.
 
పది పరీక్షలు రాస్తుండగా అతనికి టైఫాయిడ్ జ్వరం వచ్చినా పరీక్షలు రాసి 8.3 గ్రేడ్ పాయింట్లు సాధించాడు. అనంతరం నగరంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మీడియట్ చేరి 949 మార్కులు సాధించాడు. ఐఐటీ సాధిస్తానన్న నమ్మకంతో ఎంసెట్ పరీక్ష కూడా రాయలేదు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అతను ఎస్సీ కేటగిరిలో 264 మార్కులు సాధించి సత్తా చాటాడు. ముంబై ఐఐటీలో ఏరోనాటికల్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలని ఉందని విశ్వతేజ చెప్పాడు. కాగా శ్రీ చైతన్య కళాశాలకే చెందిన విద్యార్థులు ఇ. సాత్విక్ శ్రీనివాస్ 1,049,బి. వంశీరాజ్ 1180, ఎ. చాణిక్యనాగ్  2197 ర్యాంకులను ఎస్సీ కేటగిరిలో సాధించారు.
 
అనంతపురం ఎడ్యుకేషన్ :
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రవేశ పరీక్షలో రఘువీర్ మెరిశాడు. జాతీయ స్థాయిలో ఓబీసీ కేటగిరీలో 16వ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 195వ ర్యాంకు సాధించాడు. వివరాల్లోకి వెళితే.. రఘువీర్ తండ్రి ఉప్పర నరసింగప్ప పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్. తల్లి పార్వతి గృహిణి. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చుమర్రి స్వగ్రామం. తండ్రి నరసింగప్ప ఉద్యోగరీత్యా అనంతపురం జిల్లాలో చాలాకాలం పని చేశారు. సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తూ ఇక్కడే సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పుంగనూరులో పని చేస్తున్నారు. నరసింగప్ప దంపతుల కుమార్తె  ఉషశ్రీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని గీతం యూనివర్సిటీలో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతోంది.
 
కుమారుడు ఉప్పర రఘువీర్ ప్రాథమిక విద్య గోరంట్ల, గుంతకల్లు, ఉన్నత విద్య అనంతపురం, హైదరాబాద్‌లో సాగింది. 8వ తరగతిలో నిర్వహించిన ప్రతిభా పరీక్షలో మంచి ర్యాంకు సాధించడంతో ఎలాంటి ఫీజు లేకుండా హైదరాబాద్‌లో టాలెంట్ స్కూల్‌లో 9 నుంచి 10వ తరగతి వరకు చదివాడు. పదో తరగతిలోనూ మంచి మార్కులు సాధించడంతో ఇం టర్మీడియట్ చైతన్య, నారాయణ కళాశాలలో ఉచిత సీటు పొందాడు. ఎంసెట్‌లో కూడా 66వ ర్యాంకు సాధించాడు. తనకు తల్లిదండ్రు లు ప్రోత్సాహంతోనే తాను ఐఐటీలో మంచి ర్యాం కు సాధించగలిగానని రఘువీర్ తెలి పాడు.
 
ఓపెన్ కేటగిరిలో దీపికకు 1041వ ర్యాంకు
కర్నూలు నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసిన పుప్పాల దీపిక జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఓపెన్ కేటగిరిలో 1,041 ర్యాంకు సాధించి సత్తా చాటింది. స్థానిక గాయత్రి ఎస్టేట్ కాలనికి చెందిన ఆమె ఆరు వరకు స్థానిక ఎ.క్యాంపులోని మాంటిస్సోరి పాఠశాలలో, 7 నుంచి 10వ తరగతి వరకు ఆర్‌ఎంకే ప్లాజాలోని నారాయణ ఈ టెక్నో స్కూల్‌లో చదివారు. అనంతరం నారాయణ కళాశాలలో ఇంటర్ మీడియట్‌లో చేరి ఎంపీసీలో 982 మార్కులు, ఎంసెట్‌లో 131 మార్కులతో రాష్ట్రస్థాయిలో 471వ ర్యాంకు కైవసం చేసుకున్నారు.
 
ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ఆమె 1,041 ర్యాంకుతో సత్తాచాటారు. ఆమెతో పాటు ఇదే కళాశాలలో చదివిన ఎం. కళ్యాణి 1631(ఎస్సీ), పీవీఎస్ చాణక్య 1871(ఓబీసీ), వి. హరికృష్ణ 2114, కె. కుబేర్ 2596(ఓబీసీ), కె. వంశీకృష్ణ 3180(ఓపెన్), శశిధర్ వాల్తాటి 3381(ఎస్సీ), కె సుదీర్ 3487(ఎస్సీ), ఎస్. దివ్య మౌని 3613(ఎస్సీ), ఎస్‌జి అమిత్‌కుమార్ 3814(ఓబీసీ), విక్రమ్‌కుమార్ చౌదరి 4540(ఓబీసీ),  డి.  మనోజ్ కుమార్ 5571(ఓబీసీ) ర్యాంకులు సాధించారు.

మరిన్ని వార్తలు